'కమీషన్లు కొల్లగొట్టింది నిజం కాదా?'.. లోకేష్‌పై మంత్రి కాకాణి ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నేతలు ఎక్కడా తగ్గడం లేదు. టీడీపీ నేతలు.. వైసీపీ పాలనలో అభివృద్ధి జరగడం లేదని ఆరోపిస్తుంటే,

Update: 2023-06-16 11:54 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నేతలు ఎక్కడా తగ్గడం లేదు. టీడీపీ నేతలు.. వైసీపీ పాలనలో అభివృద్ధి జరగడం లేదని ఆరోపిస్తుంటే, వైసీపీ నేతలు తమ పాలనలో జరిగిన అభివృద్ధి చూపిస్తూ.. మీ(టీడీపీ) పాలనలో ఈ అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. టీడీపీ నేత నారా లోకేష్‌పై విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదని, యువగళానికి స్పందనే లేదని ఎద్దేవా చేశారు.

శుక్రవారం నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏ పంట ఎక్కడ పండుతుందో కనీస పరిజ్ఞానం లేని లోకేష్‌ కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. తెలుగు దేశం పార్టీ హయాంలో సాగు, తాగునీరు లేదని, చంద్రబాబు అధికారంలోకి ఉంటే కరువు కటకాలు విలయతాండవం చేస్తాయన్నారు. బాబు హయాంలో ప్రతి ఏటా కరువు మండలాలు ప్రకటించారని గుర్తుచేశారు. సోమశిల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ తీసుకొస్తామని చెబుతున్న లోకేష్‌.. చంద్రబాబు హయాంలో ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. రైతు రథం పేరుతో కమీషన్లు కొల్లగొట్టింది నిజం కాదా..? అని ప్రశ్నించారు.

అప్పటి మంత్రి సోమిరెడ్డి మిల్లర్ల నుంచి ముడుపులు దండుకున్నాడని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో విత్తనాల కోసం క్యూలో నిలబడి రైతులు చనిపోయారన్నారు. వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు, టీడీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ హయాంలో ఆర్బీకేలను ఎందుకు తీసుకురాలేదని మంత్రి కాకాణి ప్రశ్నించారు. ఉద్యానవన పంటల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందన్నారు. దీన్ని మర్చిపోయి లోకేష్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడన్నారు. టీడీపీ హయాంలో నకిలీ విత్తనాలు, ఎరువులు పంపిణీ చేశారని, రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేసింది లోకేష్‌కు గుర్తుకు లేదా..? అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. 

Tags:    

Similar News