రాజకీయాలలో జగన్ ఒక బచ్చా

మూడు సంవత్సరాల్లో వైసీపీ పాలన ముప్ఫయి ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

Update: 2022-06-15 13:22 GMT

మూడు సంవత్సరాల్లో వైసీపీ పాలన ముప్ఫయి ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చోడవరం జరిగిన మిని మహానాడులో ఆయన ప్రసంగించారు. చోడవరం నుంచి వైసీపీ పతనం ప్రారంభమయిందన్నారు. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడే పార్టీ కాదు టీడీపీ అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. జగన్ రాజకీయాల్లో ఒక బచ్చా అని, టీడీపీని భూస్థాపితం చేయడం నీవల్ల కాదని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎవరైతే ఈ వైసీపీ ప్రభుత్వంలో బాధపడుతున్నారో వారికి అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

నలభై ఏళ్లలో టీడీపీ....
ఇలాంటి మహానాడులు 26 పెడతామన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో టీడీపీని ముందుకు తీసుకెళతామన్నారు. 40 ఏళ్లలో టీడీపీ రాష్ట్రానికి చేసిన పనులను జ్ఞాపకాలకు తెచ్చుకుందామన్నారు. దాని ఫలితాలు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలన్నారు. ప్రతి ఒక్క ఇంటిలో చర్చ జరగాలన్నారు. చోడవరంలో సంక్షేమ పథకాలు వచ్చాయంటే అవి తెలుగుదేశం పార్టీ వల్లనేనని అన్నారు. సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, బీసీలకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీ అని చంద్రబాబు చెప్పారు.
రోడ్లన్నీ గుంతలే...
స్థానిక సంస్థల్లో 30 శాతం వెనకబడినవర్గాలకు టీడీపీ రిజర్వేషన్లు పెడితే వైసీపీ 25 శాతానికి తగ్గించారని చంద్రబాబు అన్నారు. విశాఖపట్నాన్ని విజయసాయిరెడ్డి దోచేశాడన్నారు. ఏ2కు ఇక్కడ ఏం సంబంధం అని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖలో ఒక తట్ట మట్టి వేయలేని వ్యక్తి రాజధాని తెస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అనకాపల్లి నుంచి చోడవరం వరకూ రోడ్ల పరిస్థితి చూస్తేనే ఈ ప్రభుత్వం పనితీరు అర్థమవుతుందన్నారు. రోడ్లకు గుంటల్లో మట్టి వేయలేని ముఖ్యమంత్రి విశాఖలో రాజధాని పెడతారంట అని ఎద్దేవా చేశారు.కిలో మీటరుకు 150 గుంతలున్నాయన్నారు. పెట్రోలు, డీజిల్ పెరిగిందని, గ్యాస్ రేట్లు పెంచారన్నారు. విజయసాయిరెడ్డిని పంపేసి సుబ్బారెడ్డిని తెచ్చారన్నారు. ఇదేనా సామాజిక న్యాయమా‌? అని చంద్రబాబు అన్నారు.
ఎవరు పెట్టుబడులు పెడతారు?
వైసీపీ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఏ రైతు కూడా ఆనందంగా లేడన్నారు. కోనసీమలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారన్నారు. రైతు బీమా పథకం కింద మూడు వేల కోట్లు చెల్లించామంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని, ఎక్కడా రైతులకు బీమా సొమ్ము అందలేదన్నారు. యువకులకు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా వచ్చాయో చూశారా? అని ప్రశ్నించారు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. ఈ ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఎవరికీ ఉద్యోగాలు రావని, ఎవరూ పెట్టుబడులు పెట్టరని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇంగ్లీష్ మీడియం ఏమైందని ఆయన ప్రశ్నించారు.


Tags:    

Similar News