Chandrababu : ఈ దుర్మార్గులను ఏం చేసినా పాపం లేదు

ఏపీపీఎస్సీ అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు

Update: 2024-03-15 07:28 GMT

ఏపీపీఎస్సీ అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చైర్మన్‌ను నామినేట్ చేస్తారని, సమర్థ చైర్మన్ లేకపోతే బోర్డు అంతా సర్వనాశనమవుతుందని అన్నారు. రాజకీయ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీని పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర యువతను దుర్మార్గంగా దగా చేసి వారి ఆశలు చంపేశారన్న చంద్రబాబు, క్షమించరాని నేరం చేసిన దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పు లేదన్నారు. నిరుద్యోగ యువత పట్ల క్రూర మృగాలకంటే ఘోరంగా వ్యవహరించారన్నారు. తిట్టేందుకు సరైన మాటలు కూడా రానంత నీచంగా వ్యవహరించారని అన్నారు.

నిరుద్యోగులను మోసం చేసి...
నిరుద్యోగులకు వెలుగులు పంచాల్సిన ఏపీపీఎస్సీ చీకట్లు నింపిందన్నారు. నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్‌భాస్కర్‌ను మెడపెట్టి బయటకు పంపారని, అవగాహన లేని అనర్హులకు ఏపీపీఎస్సీలో చోటు కల్పించారని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్‌ను ఛైర్మన్ గా నియమించారని, 2018లో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్‌లో అవినీతే రాజ్యమేలిందని అన్నారు. గౌతంగ్ సవాంగ్ వచ్చాక మళ్లీ వాల్యుయేషన్‌కు తెరలేపి అభ్యర్థులకు అన్యాయం చేశారన్నారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు అక్రమాల్లో భాగస్వామిఅని చంద్రబాబు ఆరోపించారు.


Tags:    

Similar News