Tadipathri : యుద్ధానికి తెరపడేదెన్నడు.. ఇలా ఎన్నాళ్లు
తాడిపత్రి నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ నిత్యం రగులుతూనే ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య సవాళ్ల పర్వం నిత్యం నడుస్తూనే ఉంటుంది
తాడిపత్రి నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ నిత్యం రగులుతూనే ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య సవాళ్ల పర్వం నిత్యం నడుస్తూనే ఉంటుంది. ఈరోజుతో మొదలయిన యుద్ధం కాదిది. కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్న వార్ కావడంతో దీనికి తెరపడే అవకాశం లేదన్నది వాస్తవం. అధికారంలో ఉన్నవాళ్లు రెచ్చిపోవడం, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ల కొంత తగ్గుతుండటం ఇక్కడ మామూలుగానే కనపడుతుంది. 2019 ఎన్నికల వరకూ జేసీ కుటుంబానిదే తాడిపత్రిలో ఆధిపత్యం నడిచేది. అయితే ఆ ఎన్నికల్లో తొలిసారి అక్కడ వైసీపీ జెండా ఎగిరింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించడంతో మొదలయిన యుద్ధం నేటికీ ముగియలేదు.
జేసీ కుటుంబం గెలవడంతో...
మొన్నటి ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా తాడిపత్రిలో విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి హవా మొదలయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై తన అనుచరులతో కలిసి దాడి చేయడమే కాకుండా ఫర్నీచర్ ను కూడా ధ్వంసం చేశారు. వాహనాలతో పాటు ఫర్నీచర్ ను కూడా తగులపెట్టారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో లేరు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువ సమయం జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ లోనే ఉండేది. ఇప్పుడు తాడిపత్రిలో జేసీ కుటుంబం చేతిలోకి మళ్లీ రావడంతో ఆయన ఇక పెద్దారెడ్డిని అడగుపెట్టనివ్వడం లేదు.
అడ్డుకున్నప్పటికీ...
తాడిపత్రికి వచ్చేందుకు అనేకసార్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నించినా పోలీసులు శాంతి భద్రతల సమస్య పేరు చెప్పి అడ్డుకున్నారు. ఆయనను జిల్లాలోని వేరే ప్రాంతానికే పరిమితం చేశారు. అయితే పెద్దారెడ్డి మాత్రం హైకోర్టుకు వెళ్లి మరోసారి ఆదేశాలు తెచ్చుకున్నారు. పోలీసులే దగ్గరుండి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని, ఆయనకు భద్రతను కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నేడు తాడిపత్రికి పెద్దారెడ్డి చేరుకోనున్నారు. మరొకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఈరోజు తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని పెట్టారు. దీనికి పెద్దయెత్తున కార్యకర్తలు తరలి రావాలని కోరారు. దీంతో తాడిపత్రి లో టెన్షన్ నెలకొంది. పోలీసులు ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. కానీ మరోసారి పెద్దారెడ్డిని అడ్డుకోవడంతో ఆయన రాకపోవడంతో కొంత పరిస్థితులు సద్దుమణిగాయని పోలీసులు చెబుతున్నారు. మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా అని ఛాలెంజ్ విసిరారు.