Hot Summer : బయటకు రాలేము.. ఇంట్లో ఉండలేము.. తెలుగు రాష్ట్రాల్లో పెనం మీదున్నట్లుందిగా

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి

Update: 2025-04-27 04:10 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే వర్షం పడుతుందని చెప్పినా కొన్ని ప్రాంతాల్లోనే అలా జల్లులు కురిసి వెళ్లిపోతుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. కేవలం ఎండల తీవ్రత మాత్రమే కాదు వడగాల్పుల తీవ్రత కూడా అత్యధికంగా ఉంటుందని చెప్పింది. ఆదివారం కూడా పదిహేడు మండాలాల్లో వడగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమయినంత వరకూ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వడదెబ్బ తగిలే అవకాశముందని కూడా పేర్కొంది.

డీహైడ్రేషన్ కు లోను కాకుండా...
అత్యధికంగా కడప జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వేసవి తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరగనుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అయితే కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముందని, ఎవరూ పొలాల్లో చెట్ల కింద నిలబడవద్దని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు ఎవరూ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీ హైడ్రేషన్ కు లోను కాకుండా రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇకమే నెలలో సూర్యుడు చెలరేగిపోతాడని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
45 డిగ్రీలు దాటడంతో...
తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే అనేక జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు దాటడంతో ప్రజలు పెనంపై ఉన్నట్లు ఫీలవుతున్నారు. ఈ ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన ఇరవై ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఎండలతో పాటు వడగాలుల తీవ్రత కూడా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిది. ఈ నెల 29వ తేదీ వరకూ వడగాల్పులు ఉంటాయని చెప్పింది.


Tags:    

Similar News