Andhra Pradesh : ఆ నెల చంద్రబాబుకు కీలకం... ఆ రెండు పథకాలను అమలు చేయాలంటే?
ఆంధ్రప్రదేశ్ లో జూన్ నెల నుంచి రాష్ట్ర ఖజానా పై భారం పడుతుంది. ఈ నెలలో రెండు కీలకమైన హామీలను ప్రభుత్వం అమలు చేయనుంది
ఆంధ్రప్రదేశ్ లో జూన్ నెల నుంచి రాష్ట్ర ఖజానా పై భారం పడుతుంది. ఈ నెలలో రెండు కీలకమైన హామీలను ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ హామీలను అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సభలో చెబుతున్నారు. తల్లికి వందనం పథకం నిధులను అధికారులు విడుదల చేశారు. ఈ పథకం ఒక్కదానికే దాదాపు 8,475 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు బడ్జెట్ లో ఈ రెండు పథకాల కోసం కేటాయింపులు జరిపినప్పటికీ అందుకు అవసరమైన నిధుల కోసం అప్పులు చేయక తప్పదు. అందులోనూ కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత తొలిసారి అమలయ్యే ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం వరసగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది.
తొలివిడత గా...
రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం జూన్ నెలలో అమలు చేయనున్నారు. ఇందుకు తొలి విడతలో ఒక్కొక్కరి ఖాతాలో నాలుగు వేల రూపాయలు జమ చేయాల్సి వస్తుంది. ఇందుకోసం ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావచ్చిందంటున్నారు. మే నెల నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడంతో అందుకు సంబంధించిన విధివిధానాలను కూడా రూపు దిద్దుకున్నాయని అంటున్నారు. ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో మూడు విడతలుగా ఈ ఆర్థిక సాయాన్ని రైతులకు అందచేయనున్నారు. అందుకే జూన్ నెలలో ఒక్కొక్కరి ఖాతాలో నాలుగు వేల రూపాయలు నగదు వేయాలంటే నిధులు వేల కోట్లు అవసరమవుతాయి. ఇందుకోసం అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ నిధులతో కలిపి ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. అయితే ఈ పథకం కింద అర్హులుగా నలభై రెండు లక్షల మంది మాత్రమే ఎంపికయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
తల్లికి వందనం అమలుతో...
ఇక జూన్ నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాల్సి వస్తుంది. పాఠశాలలు వేసవి సెలవులు అనంతరం తెరుచుకునే రోజునే ఈ నిధులను జమ చేశారు. అయితే ఇందులో ఏడాదికి పదిహేను వేలు ఒక్కొక్క విద్యార్థికి ఇస్తామని ప్రకటించారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా వారికి పదిహేను వేల రూపాయలు జమచేస్తామని చెప్పింది. ఈ పథకం కోసం బడ్జెట్ లో 9,407 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. కానీ తల్లికి వందనం పథకం కింద చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతి విద్యార్థికి అందచేయాలంటే ఖజానాపై పెనుభారం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 67 లక్షల మంది ఈ పధకం కింద లబ్దిపొందుతున్నారు.
అర్హులు వీరే...
అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు తో పాటు ఆధార్ కార్డు ఉండాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేయనున్నారు. అయితే ఒక పథకం పొందే వారిని మినహాయిస్తారా? లేక తెలుపు రంగు రేషన్ కార్డు ఉంటే అన్ని పథకాలు వర్తిస్తాయా? అన్నది తేలాల్సి ఉంది. దీంతో పాటు తల్లికి వందనం పథకం కింద హాజరు శాతాన్ని బట్టి నిధులను విడుదల చేయనున్నామని అధికారులు తెలిపారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఎవరున్నా ఈ పథకాలు వర్తించవని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పాటు కారు వంటి వాహనాలు ఉన్నా వారికి ఈ పథకాలను అందచేయకూడదని నిర్ణయించారు. విద్యుత్తు వాడకాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. మొత్తం మీద జూన్ నెల ఏపీ ప్రభుత్వానికి కీలకమనే చెప్పాలి.