చిత్తూరు అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి.. అలా వచ్చి పెళ్లి

ఊరి పెద్దల సమక్షంలో స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయంలో 15 రోజుల క్రితం పెళ్లి కూడా

Update: 2023-07-29 03:41 GMT

ఒక దేశానికి చెందిన వ్యక్తులు.. వేరే దేశానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఇటీవల చాలానే చూశాం. ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకోడానికి సముద్రాలను దాటుతున్న ఘటనలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కూడా చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు.. శ్రీలంకకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరి ప్రేమకు కూడా సోషల్ మీడియానే కారణమైంది.

చిత్తూరు జిల్లా వికోట కు చెందిన లక్ష్మణ్ అనే యువకుడితో 6 ఏళ్ల క్రితం ఫేస్ బుక్ లో శ్రీలంక యువతి విఘ్నేశ్వరికి మధ్య పరిచయం జరిగింది. ఆమె అతడి కోసం భారత్ కు వచ్చి.. పెళ్లి చేసుకుంది. లక్ష్మణ్ తాపీ మేస్త్రీగా పని చేస్తూ ఉంటాడు. విఘ్నేశ్వరి, లక్ష్మణ్ ల మధ్య 6 ఏళ్ల నుండి మాటలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ తర్వాత తాము ప్రేమలో ఉన్నామని భావించారు. అనుకున్నట్లుగానే ఆమెను భారత్ కు రమ్మని పిలిచాడు లక్ష్మణ్. 20 రోజుల క్రితం వీకోట మండలం ఆరిమాకులపల్లి కి ఆమె వచ్చేసింది. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, ఊరి పెద్దల సమక్షంలో స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయంలో 15 రోజుల క్రితం పెళ్లి కూడా జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఆగస్టు 6 నాటికి విఘ్నేశ్వరి వీసా గడువు ముగియబోతోంది. పోలీసులు ఆమెను చిత్తూరు ఎస్పీ ఆఫీసుకు పిలిచి వీసా గడువు వివరాలు సేకరించారు. టూరిస్ట్ వీసా గడువు ముగుస్తున్న విషయం గురించి మాట్లాడారు. గడువు ముగిసే లోపు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు పోలీసులు. శ్రీలంక లో ఉన్న విఘ్నేశ్వరి తల్లిదండ్రులకు సమాచారమిచ్చి విదేశీ యువతిని చట్టబద్దంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. అయితే విఘ్నేశ్వరి శ్రీలంకకు వెళితే ఆమె తల్లిదండ్రులు ఆమెను తిరిగి భారత్ కు పంపిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News