Andhra Pradesh : ఏపీలో ప్రత్యర్థులు లేరు.. అందరూ మిత్రులే... వెరైటీ పాలిటిక్స్

రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీలు కేంద్రంలో ఉండే బీజేపీ వైపు నిలుస్తున్నాయి

Update: 2025-08-26 07:54 GMT

ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలు ప్రత్యర్థులుగా ఉంటూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒకరు మద్దతిస్తే, మరొకరు వ్యతిరేకిస్తారు. కానీ ఏపీ రాజకీయాల తీరు వేరు. 2014 లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఇక్కడ ప్రధాన ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీలు కేంద్రంలో ఉండే బీజేపీ వైపు నిలుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి అనేక సందర్భాల్లో మద్దతుగా నిలిచింది. ఇక నాడు ప్రారంభమయిన దోస్తీ నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. 2014లో కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన టీడీపీ, బీజేపీలు తర్వాత విభేదాలతో విడిపోయాయి. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది.

మధ్యలో వ్యతిరేకించినా...
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో నాడు బీజేపీని వ్యతిరేకించిన చంద్రబాబు దాదాపు ఐదేళ్లు ఢిల్లీకి వెళ్లలేదు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పట్ల టీడీపీ సాఫ్ట్ కార్నర్ గా వ్యవరిస్తూ వచ్చింది. అంతేకాదు టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి నాడు అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతిస్తూ వస్తుంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ చివరకు 2019 లో ఫలితాల తర్వాత మాత్రం తిరిగి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. 2024లో తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీలు కలసి పోటీ చేసి అధికారంలోకి రాగలిగాయి.
పదేళ్ల నుంచి...
ఇక గత పదేళ్ల నుంచి ఏ ఎన్నికలో ఏ ఫలితం వచ్చినప్పటికీ, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అవసరమైన సమయంలో టీడీపీ, వైసీపీలు నేరుగానే మద్దతు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఒరకంగా చూడాలంటే టీడీపీ, వైసీపీలు రెండూ బీజేపీని శత్రువుగా చూడటం లేదు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కు మాత్రం దగ్గరయ్యే ప్రయత్నం చేయడం లేదు. అందుకే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆమోదించే ప్రతి బిల్లును కూడా సమర్థించే పరిస్థితులు వచ్చాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి శత్రుపార్టీ అంటూ ఏమీ లేదు. అందరూ మిత్రులే. అదే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం ఇటు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, అటు జాతీయ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండగా, ఏపీలో మాత్రం భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. భవిష్యత్ లోనూ ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సపోర్టు మాత్రం బీజేపీకి ఇవ్వడం మాత్రం ఇక్కడ రివాజుగా మారింది. తాజాగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతు పలకడంతో మరొకసారి ఇది చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News