జగన్ ప్రభుత్వానికి ఊహించని షాక్

రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు

Update: 2023-08-03 06:41 GMT

రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్ లో నిర్మాణాలను ఆపేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ పనులపై స్టే విధిస్తూ త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఈమేరకు ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్ లను విచారిస్తున్న జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది.

అమరావతి సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో పేదల కోసం మొత్తం 25 లే అవుట్‌లలో 50,793 మందికి ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే గత నెల 24న నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేశారు. ఏపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో రాజధానేతర ప్రాంత వాసులకు ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాలను అందజేసింది. ఇందుకోసం రాజధాని ప్రాంతంలో 1400 ఎకరాలను కేటాయించి, 50,793 మందికి ఇళ్ల నిర్మాణ పత్రాలను మంజూరు చేసింది. అమరావతిలోని ఆర్-5 జోన్ ఎలక్ట్రానిక్ సిటీ అని, పేదలకు ఇళ్ల స్థలాలను మరోచోట ఇవ్వాలని రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ హైకోర్టును ఆశ్రయించగా.. త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.


Tags:    

Similar News