అధికారం ఉందని విర్రవీగినా.. రెచ్చిపోయినా..ఫలితం ఇలాగే ఉంటుంది

మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై వరస కేసులు నమోదవుతున్నాయి. కొన్ని నెలల నుంచి జైలులోనే ఉంటున్నారు

Update: 2025-07-30 08:01 GMT

అధికారం ఉన్నప్పుడు ఎవరూ విర్రవీగ కూడదు. పదవుల కోసమో.. పైవాళ్ల ప్రాపకం కోసమో వీధుల్లో రౌడీల్లాగా వ్యవహరిస్తే ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదు. ఇందుకు మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ఒక ఉదాహరణ. వైసీపీ అధికారంలో ఉండగా తురకా కిషోర్ చెలరేగిపోయాడు. పల్నాడు పర్యటనకు వచ్చిన నాటి టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు వచ్చినప్పుడు తురకా కిషోర్ వాళ్ల వాహనంపై దాడికి దిగారు. దీంతో మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ గా పదవి లభించింది. నాలుగేళ్లు హ్యాపీనే. తర్వాతే తురకా కిషోర్ కు కష్టాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలలుగా జైలులోనే ఉన్నారు.

పిన్నెల్లి ముఖ్య అనుచరుడిగా...
తురకా కిషోర్ మాజీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరుడు. అయితే పిన్నెల్లికి ఓటమి లేదని భావించి తురకా కిషోర్ రెచ్చిపోయాడు. అందులోనూ వైసీపీ అధికారంలో ఉండటంతో తానే ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ లాగా వ్యవహరించాడు. అంతటితో ఆగలేదు. నియోజకవర్గంలోని అనేక మంది టీడీపీ నేతలను పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. అప్పుడు హ్యాపీగానే ఉంది. అధికారం ఉన్నప్పుడు ఆల్ ఈజ్ వెల్. కానీ ప్రభుత్వం మారిన వెంటనే ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి పాలు కావడంతో పాటు పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో తురకా కిషోర్ పై వరస కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడెక్కడి వారో వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.
మరో కేసులో...
ఇప్పటికే తురకా కిషోర్ పై పదికి పైగా కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసుల్లో తురకా కిషోర్ నిందితుడిగా ఉన్నాడు. దీంతో గత కొద్ది నెలలుగా జైలు జీవితమే గడుపుతున్నాడు. తాజాగా తురకా కిశోర్ పై నమోదయిన అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. అయితే పోలీసులు వదులుతారా? మరో కేసు రెడీ గా ఉంది. గుంటూరు జిల్లా జైలు నుండి విడుదలైన కిషోర్ ను రెంటచింతల పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎన్ని కేసులు పెడతారంటూ కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డగించినా చట్టం తన పనితాను చేసుకుపోతుందంటూ తురకా కిషోర్ ను రెంటచింతల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంకా ఎన్ని కేసులు సిద్ధంగా ఉన్నాయో... చేసుకున్నోడికి.. చేసుకున్నంత.


Tags:    

Similar News