Simhachalam Accident : సింహాచలం ప్రమాదంలో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు
సింహాచలం దేవాలయంలో జరిగిన ప్రమాదంపై అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
సింహాచలం దేవాలయంలో జరిగిన ప్రమాదంపై అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అధికారుల ఒత్తిడి మేరకే తాను గోడను నిర్మించానని కాంట్రాక్టరు చెప్పడంతో అధికారులే ఈ తప్పిదానికి పాల్పడినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సింహాచలం దేవస్థానంలో అప్పన్న సన్నిధితో చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఏడుగురు అమాయకులు మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం త్రీమెన్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ త్రీమెన్ కమిటీ కాంట్రాక్టరుతో పాటు అధికారులను కూడా విచారించింది. అయితే కాంట్రాక్టరు లక్ష్మణరావు మాత్రం ప్రమాద ఘటనపై సంచలన విషయాలు కమిటీ సభ్యుల ముందు ఉంచడంతో అధికారులు ఇరుక్కున్నట్లయింది.
తనపై వత్తిడి తెచ్చారంటూ..
కేవలం ఆరు రోజుల సమయానికి ముందు గోడ కట్టాలని తనపై వత్తిడి తెచ్చారంటూ లక్ష్మణరావు చెప్పారు. ఇంజినీరింగ్ అధికారుల వత్తిడితోనే అయిష్టంగానే తాను గోడ నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. అయితే భారీ వర్షం, ఈదురుగాలులతో పాటు గోడకు టెంట్ తాళ్లు కట్టడం వల్ల కూడా గోడ కూలిపోవడానికి కారణమని లక్ష్మణరావు ముగ్గురు సభ్యుల కమిటీ ముందు ఉంచారు. గోడ నిర్మాణం మొత్తం నాలుగు రోజుల్లో పూర్తి చేయడం జరిగిందని లక్ష్మణరావు తెలిపారు. గోడ నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు ఇంజినీర్లు ఎవరూ అక్కడకు రాలేదని, రెండో రోజు నుంచి మాత్రం వచ్చి నిర్మాణాన్ని పరిశీలించారని తెలిపారు. అధికారుల చెప్పడంతోనే అగ్రిమెంట్ లేకుండానే గోడ నిర్మాణాన్ని చేపట్టానని కాంట్రాక్టరు తెలిపారు.
నాలుగు రోజుల్లో...
చందనోత్సవానికి తక్కువగా సమయం ఉందని చెప్పినా అధికారులు వినలేదని అన్నారు. దేవస్థానం, టూరిజం అధికారులు గోడ కట్టమని ఒత్తిడి చేశారన్న కాంట్రాక్టరు చేసిన ఆరోపణలపై అధికారులను కూడా త్రీమెన్ కమిటీ విచారించింది. ఆరు రోజులు టైంలో కట్టే నిర్మాణం సాధ్యం కాదని ముందే చెప్పానని,నాలుగు రోజుల ముందు పని మొదలు పెట్టామన్న తాత్కాలిక నిర్మాణమని తనతో అధికారులు చెప్పడంతోనే తాను గోడ నిర్మాణం చేపట్టానని లక్ష్మణరావు చెప్పారు. అయితే అధికారుల నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనపడుతుంది. ఈవో సెలవుపై వెళ్లడంతో పాటు ఇంజినీరింగ్ అధికారులు కేవలం హడావిడిగా గోడను నిర్మించడం వల్లనే ఇంతటి ప్రమాదం జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. మరి ఎవరిపైన వేటు వేస్తారన్నది చూడాలి.