Tg Venkatesh : ఒక ప్రయత్నం బెడిసికొట్టడంతో మరొక రూట్ లో ప్రయత్నిస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత టీజీ వెంకటేశ్ కు ఇక బీజేపీలో పదవి లభించడం కష్టమే

Update: 2025-04-19 07:29 GMT

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత టీజీ వెంకటేశ్ కు ఇక బీజేపీలో పదవి లభించడం కష్టమే. ఆయన పేరును ఏ దశలోనూ పరిశీలించే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున తనకు మరోసారి పెద్దల సభకు వెళ్లే అవకాశాన్ని కల్పించాలని టీజీ వెంకటేశ్ కోరినా కేంద్ర నాయకత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. దీంతో ఆయన ఈ ఐదేళ్ల పాటు ఆయన రాజకీయ పదవులకు దూరంగా ఉంటారన్న టాక్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. టీజీ వెంకటేశ్ బలమైన రాజకీయ నేత, ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడంతో ఆయనకు రాజ్యసభలో మరోసారి అవకాశం లభిస్తుందని అందరూ అనుకున్నా అది ఈ టర్మ్ లో సాధ్యం కాదంటున్నారు.

మూడు పార్టీలు మారి...
మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అయితే కర్నూలు పట్టణ నియోజకవర్గం నుంచి ఓటమిపాలు కావడంతో ఆయనకు టీడీపీ నుంచి రాజ్యసభ పదవి దక్కింది. టీడీపీలో కీలకంగా ఉన్న టీజీ వెంకటేశ్ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఏపీలో ఓటమి పాలయిన తర్వాత నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు ఆయన కూడా బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం టీజీవెంకటేశ్ బీజేపీలోనే కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన బీజేపీ పెద్దలకు దగ్గరయ్యారు. ఢిల్లీలో తకున్న పరిచయాలతో బీజేపీ అగ్ర నాయకత్వంతో మాట్లడే దారులున్నాయి. అయితే ఆయన చేసిన కొన్ని ప్రయత్నాలకు బీజేపీ నాయకత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మౌనంగా ఉన్నారని తెలిసింది.
భరత్ భవిష్యత్ కు ఢోకా లేకున్నా...
టీజీ వెంకటేశ్ తాను టీడీపీ నుంచిబీజేపీలోకి మారినా తన కుమారుడు టీజీ భరత్ ను మాత్రం 2014 నుంచి టీడీపీలోనే ఉంచారు. టీజీ భరత్ 2019 ఎన్నికలలో కర్నూలు నుంచి ఓటమి పాలయినా 2024 లో మళ్లీ అదే టీడీపీ నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా చేరారు. కుమారుడి రాజకీయ భవిష్యత్ లో టీజీ వెంకటేశ్ కు ఇక ఆలోచన లేదు. భరత్ లోకేశ్ టీంలో ఉన్నారు. భరత్ రాజకీయ భవిష్యత్ కు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎటూ తన విషయంలోనూ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుమారుడు మంత్రి పదవి లో ఉండటం కూడా టీజీకి పదవి రాకపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉండటంతో ఒకే కుటుంబంలో ఇన్నిపదవులన్న విమర్శలు వస్తాయని కేంద్ర నాయకత్వం కూడా ఆలోచించే అవకాశముందని పార్టీ వర్గాలుచెబుతున్నాయి.
రాయలసీమలో టీజీ కంటే...
రాయలసీమలో టీజీ వెంకటేశ్ కంటే ఎంతో మంది కీలక నేతలు బీజేపీలో ఉన్నారు. వారిని కాదని టీజీ వెంకటేశ్ కు రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలో వచ్చిన వారికి ఇచ్చి తొలి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం చేశారన్న పేరు కేంద్ర నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోదంటున్నారు. అందుకే టీజీ వెంకటేశ్ ఈ ఐదేళ్ల కాలంలో రాజ్యసభ పదవి కోసం వెయిట్ చేయడం కూడా వృధాయేనంటున్నారు. ఆయన ఏదైనా ప్రయత్నం చేసుకుంటే గవర్నర్ పోస్టు కోసం ప్రయత్నిస్తే కొంత సానుకూల ఫలితం ఉంటుందని కూడా కొందరు కమలనాధులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ పదవి కోసం ఇక ఆయన ప్రయత్నించాలి తప్పించి, రాజ్యసభ పదవి మాత్రం ఇక రానట్లే భావించాలని రాయలసీమకు చెందిన బీజేపీ నేత వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతుంది. మొత్తం మీద టీజీ వెంకటేశ్ ను భవిష్యత్ లో గవర్నర్ గా చూడగలమేమో.


Tags:    

Similar News