TDP : అతి చేస్తున్నఅమాత్యులు.. చంద్రబాబుకు తలనొప్పిగా తయారయ్యారే?
సవిత మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. అదృష్టం బాగుండి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయి కూర్చున్నారు
మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. అదృష్టం బాగుండి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయి కూర్చున్నారు. దీంతో మంత్రి సవితకు ఏమీ అర్థం కావడం లేదు. కనీసం అధికారులను గౌరవించడం కూడా తెలయకుండా మంత్రులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఫస్ట్ టైమ్ గా ఎన్నికై అదేదో తమ వల్లనే గెలిచామన్న భావనలో విర్రవీగుతుండటంతోనే ఈ సమస్య తలెత్తుతుంది. మంత్రులలో కొందరు అందులోనూ తొలిసారి మంత్రి అయిన వారు చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీకి కూడా తలనొప్పులుగా మారుతున్నారు. గతంలో కడప జిల్లాకు చెందిన మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి పోలీసు అధికారిపైనే జులుం ప్రదర్శించారు. దీంతో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
గతంలో పోలీసు అధికారిని...
ఆ దెబ్బకు మడింపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు ఆయన సతీమణి కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రులు అప్పనంగా వచ్చిన పదవులను అనుభవించడంలో తమ దర్పాన్ని ప్రదర్శించడానికే ఇలా చేస్తున్నారా? లేక అతి విశ్వాసంతో ఈ పనులు చేస్తున్నారా? అన్నది తేలకుండా ఉంది. అయితే వీరి వ్యవహార శైలి మాత్రం మొత్తం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎవరిని కట్టడి చేయలేని పరిస్థితి. తమకు అప్పగించిన శాఖల్లో పట్టు పెంచుకుని, ప్రజలకు సేవలందించాల్సిన అమాత్యులు అనవసర వివాదాల్లో కూరుకుని కూటమిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా వీరి పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు.
దురుసు ప్రవర్తనతో...
తాజాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కూడా చంద్రబాబు సర్కార్ కు తలనొప్పులు తెచ్చేలా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెనుకొండ టిక్కెట్ తెచ్చుకోవడమే అదృష్టం. ఆపైన ఎమ్మెల్యే కావడం మరొక లక్కు. అదీ చాలక ఏకంగా మంత్రి పదవి వరించింది. అణిగి మణిగి ఉండాల్సిన మంత్రి సవిత మాత్రం రెచ్చిపోతున్నారు. అదీ అధికారులపైన మంత్రి సవిత దురుసు ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెనుకొండ తహశీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బోకేను మంత్రి సవిత విసిరేసిన వీడియో వైరల్ గా మారింది. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో ఘటన జరిగింది. ఈ నెల ఒకటో తేదీన రేషన్ బియ్యం పంపిణీ సందర్భంగా ఈ ఘటన జరగడంతో మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.