Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదుగా?

తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు కూడా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు

Update: 2024-12-29 03:00 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు కూడా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో తిరుమల క్యూ లైన్ చాలా పొడవుగా ఉంది. దీంతో శ్రీవారి సేవకులు క్యూ లైన్ లో ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లో గోవిందుడి దర్శనం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధనుర్మాసం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నెల కావడంతో ఈ నెలంతా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వరస సెలవులు కూడా రద్దీ పెరగడానికి కారణమని తెలపాలి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అందుకు తగినట్లుగా టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది చివర కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. అదే సమయంలో వచ్చే నెలలో కూడా వైకుంఠ ఏకాదశి ఉండటంతో రష్ మరింత పెరగనుంది. ఇప్పటికే టిక్కెట్లన్నీ ముందుగానే బుక్ అయిపోవడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడే అవకాశముంది. ఇతర దేశాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు తరలి వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఎన్ఆర్ఐల తాకిడి ఎక్కువగా ఉందని అంటున్నారు.

బయట వరకూ క్యూ లైన్...
తిరుమల అంటేనే మరో వైకుంఠంగా భావిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు తరలి రావడం మామూలు అయిన విషయం. ఏడాదికి ఒకసారైనా తిరుమలను సందర్శించుకోవాలన్న కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే తిరుమలలో నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల వరకూ శ్రీవారి దర్శన సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,414 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


 


Tags:    

Similar News