Tirumala : తిరుమలకు శుక్రవారం పోటెత్తిన భక్తులు.. శిలాతోరణం వరకూ క్యూలైన్

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఇంకా పెరిగింది.

Update: 2025-05-30 03:16 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఇంకా పెరిగింది. గత పదిహేను రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు విస్తరించి ఉన్నాయి. అందులోనూ నేడు శుక్రవారం కావడంతో మరింత రరద్దీ పెరిగింది. సహజంగా తిరుమలకు శుక్రవారం, శనివారం, ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ వేసవి సెలవులు ముగియనుండటంతో పాటు పెళ్లిళ్లు జరుగుతుండటంతో భక్తుల తాకిడి ఎక్కువయిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

అందరికీ అన్న ప్రసాదాలు...
వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. సిఫార్సు లేఖలను కూడా స్వీకరిస్తుండటంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని, అయినా సామాన్య భక్తులు క్యూ లైన్ లోకి వచ్చిన తర్వాత ఎక్కువ సేపు వెయిట్ చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయి ఏటీసీ, టీబీసీ, ఏటీజీహెచ్, కృష్ణతేజ గెస్ట్ హౌస్, శిలాతోరణం వరకూ వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలను అందిస్తున్నట్లు చెప్పారు. క్యూ లైన్లను ఆనుకుని పదిహేను ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది.
శిలాతోరణం వరకూ క్యూ లైన్...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ లు విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,019 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 37,774 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News