Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో పాటు వినాయక చవితి పండగ కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు

Update: 2025-08-27 03:03 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో పాటు వినాయక చవితి పండగ కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నప్పటికీ సులువుగానే స్వామి వారి దర్శనం లభిస్తుంది. వినాయక చవితి రోజు సాధారణంగా ఇంటి వద్దనే ఉండి గణేశ్ ప్రతిమను ఉంచుకుని పూజలు నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే వినాయక చవితి రోజును ఎక్కువగా తీర్ధయాత్రలు చేయరు. అందులో భాగంగానే ఈరోజు భక్తుల రద్దీ కొంత తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా...
మరొకవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు మాత్రమే తిరుమలకు చేరుకుంటున్నారు. అదే సమయంలో కాలినడకన వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని, వర్షాల కారణంగా కొంత ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఘాట్ రోడ్డు నుంచి వచ్చే వాహనదారులు కూడా జాగ్రత్తలు పాటిస్తూ రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముందని తెలిపింది.
పన్నెండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,837 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,510 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News