Tiruamala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణమే. దర్శన సమయం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరింది. గురువారం అయినా భక్తులు పెద్ద సంఖ్యలో లేరు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరింది. గురువారం అయినా భక్తులు పెద్ద సంఖ్యలో లేరు. సాధారణంగానే ఉన్నారు దాదాపు నెలన్నర నుంచి తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. వసతి గదులు దొరకగడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. వేసవి రద్దీ మరికొంత కాలం కొనసాగుతుందని భావించారు. విద్యాసంస్థలు తెరిచినా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదని, ఈరోజు సాధారణంగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
రానున్న మూడు రోజుల్లో...
తిరుమలకు ముందుగా బుక్ చేసుకున్న భక్తులతో పాటు కాలినడకన వచ్చే భక్తులతో పాటు రోజువారీ ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తుండటంతో వాటిని కూడా తీసుకుని కొండకు చేరుకుంటున్నారు. తిరుమలలో సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రేపటి నుంచి శుక్రవారం కావడంతో మళ్లీ రద్దీ పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలు వరసగా మూడు రోజులు రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
పదకొండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదకొండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలుచేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,001 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,765 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.