Tirumala : ఈరోజు తిరుమలలో భారీగా పెరిగిన భక్తులు.. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి
నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నేడు హోలీ పండగ కావడంతో పాటు వరస సెలవు దినాలు రావడంతో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. శుక్రవారం సహజంగానే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీనికి తోడు వరస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు నేడు గంటల కొద్దీ సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కంపార్ట్ మెంట్లన్నీ ఫుల్లుగా భక్తులతో నిండిపోయాయి.
నేడు కుమారధార తీర్థ ముక్కోటి...
ఈరోజు పౌర్ణమి గరుడ వాహన సేవ తిరుమలలో జరగనుంది. రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు మాడ వీధుల్లో దర్శనమి్వ్వనున్నారు. దీంతో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కుమారధార తీర్థ ముక్కోటి కూడా ఉండటంతో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకకే భక్తులను అనుమతించనున్నారు. తిరుమల నుంచి నేడు పాపవివనాశనం వరకూ ప్రయివేటువాహనాలను నిలిపేస్తూ టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. పాపవినాశనం వద్ద ఉచితంగా అన్న ప్రసాదాలను తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేయనుంది.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 51,148 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 21,236 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం3.56 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.