Tirumala : తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగానే కొనసాగుతుంది. మంగళవారం కావడంతో రద్దీ తగ్గింది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగానే కొనసాగుతుంది. మంగళవారం కావడంతో పాటు వేసవి సెలవులు పూర్తి కావడంతో రద్దీ తగ్గిందని అంటున్నారు. మరొకవైపు భారీ వర్ష సూచన కూడా తిరుమల ప్రయాణం చేసేందుకు భక్తులు వెనకంజ వేస్తున్నారు. తిరుమలలో సాధారణంగా సోమ, మంగళ, బుధ, గురువారాల్లో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. శుక్ర వారం నుంచి రద్దీ మొదలయి శని, ఆదివారాలు వేల సంఖ్యలో భక్తులు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారని తిరుమ తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
రెండు నెలలుగా...
గత రెండు నెలలుగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు నిండిపోయాయి. ఇరవై నాలుగు గంటల సమయం దర్శనానికి పట్టింది. అయినా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. సామాన్య భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. రెండు నెలల వరకూ వసతి గృహాలు కూడా దొరకడం దుర్లభంగా మారింది. తిరుమల వీధులన్నీ రద్దీతో నిండిపోయి ఎక్కడ చూసినా భక్తులు కనిపించేవారు.
నేడు రద్దీ సాధారణమే...
కానీ సోమవారం నుంచి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,730 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.30 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.