Tirumala : తిరుమలలో నేడు కంపార్ట్ మెంట్లన్నీ ఫుల్లు.. భక్తుల క్యూ లైన్ ఎంత పొడవో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. గత వారం రోజుల నుంచి తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టింది.
గత నెలలో అన్నప్రసాదం...
మే నెలలో కేవలం 24 రోజుల వ్యవధిలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటూ ఇతర అన్నప్రసాద కేంద్రాల్లో కలిపి 51 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ జరిగింది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో మరో 20 లక్షల మందికి పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేశారు. మే నుంచి ప్రతిరోజూ సగటున 2.5 లక్షల అన్నప్రసాదాలు, 90 వేలకు పైగా అల్పాహారాలు, పానీయాలు అందిస్తున్నారు. మే 24న ఒక్కరోజే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 93,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అదే రోజు బయట క్యూలైన్లు, వైకుంఠం ప్రాంతాల్లో 2.72 లక్షల అన్నప్రసాదాలు, 1.17 లక్షల పానీయాలు అందించారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకూ క్యూలైన్ విస్తరించింది. క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 91,538 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 37,339 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.