Tirumala : తిరుమలలో నేడు భక్తులు ఎన్ని కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కావడంతో ఒకింత రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2025-04-24 03:14 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కావడంతో ఒకింత రద్దీ ఎక్కువగా ఉంది. వరసగా పరీక్ష ఫలితాలు వెలువడుతుండటంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్ష ఫలితాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తీర్ణులయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలసి తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలకు ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ప్రత్యేక దర్శనం టిక్కెట్లు...
ఈరోజు ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. జులై నెలకు సంబంధించిన టిక్కెట్లను నేడు విడుదల చేస్తుండటంతో అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోసం ఏ నెలలోనైనా ఫుల్లు డిమాండ్ ఉంటుంది. సులువుగా దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే వసతి గృహాలు కూడా దొరుకుతాయని, జులై నెలలో అయితే కొద్దిగా రద్దీ తగ్గే అవకాశముందని భావించి టిక్కెట్లను వెనువెంటనే కొనుగోలు చేస్తారంటున్నారు టీటీడీ అధికారులు.
తొమ్మిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,705 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,382 మంది భక్తుల తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.62 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News