Tirumala : తిరుమలలో ఏ మాత్రం తగ్గని భక్తుల రద్దీ...శుక్రవారం మరింత పెరిగిన భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. అలిపిరి టోల్ గేట్ నుంచి రద్దీ మొదయింది. అక్కడ వాహనాల తనిఖీ కేంద్రం వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. దీన్ని బట్టి తిరుమలలో రద్దీ ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్ర, శని, ఆది వారాలు సాధారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే గత నెలరోజులకు పై నుంచి భక్తుల రద్దీ తిరుమలకు ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
వెలుపల వరకూ...
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ల ల వద్ద మొత్తం పన్నెండు ప్రదేశాల్లో అన్న ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులకు మజ్జిగ, మంచినీరు, అన్న ప్రసాదాలను నిరంతరం పంపిణీ చేస్తున్నారు. వసతి గృహాల కోసం కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. సిఫార్సు లేఖలపై వచ్చే వారు కూడా గంటల సేపు సీఆర్వో కార్యాలయం ముందు పడిగాపులు పడాల్సి వస్తుంది.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీ హెచ్ వరకూ క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,226 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,960 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్ల రూపాయలు ఉంది.