Tirumala : తిరుమలకు ఎప్పుడు వెళ్లినా ఇంతేనా? స్వామి వారి దర్శనం సులువుగా లభిచాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది

Update: 2025-08-03 02:33 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి అలిపిరి టోల్ గేట్ నుంచి నేడు వాహనాల రద్దీ పెరిగింది. ఘాట్ రోడ్డులోనూ ప్రయాణించే సమయంలో ఓవర్ టేక్ చేయకుండా వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఘాట్ రోడ్ లో వాహనాల రద్దీ పెరిగింది.

కొనసాగుతున్న రద్దీ...
మే నెల నుంచి ప్రారంభమయిన తిరుమలలో రద్దీ నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. గతంలో వేసవిలో మాత్రమే రద్దీ ఉండేది. ఇప్పుడు శ్రావణ మాసం కావడం, పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా జరుగుతుండటంతో అవి ముగించుకున్న తర్వాత తిరుమలేశుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఎక్కువ రోజులు కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట రెండు కిలోమీటర్ల వరకూ క్యూ లైన్ విస్తరించి ఉండటంతో కనిపించింది. అయితే భక్తులు క్యూ లైన్లలో ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అన్నప్రసాదాలను, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తుంది.
ఇరవై కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,367 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,420 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.28 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News