Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. శిలాతోరణం వరకూ క్యూ లైన్
తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది
తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ వరకూ విస్తరించి ఉంటున్నాయి. భక్తులు దర్శనం కోసం గంటల సమయం వేచి చూడాల్సి వస్తుంది. గత రెండున్నర నెలల నుంచి తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వారాలతో సంబంధం లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండటంతో హుండీ ఆదాయం కూడా భారీ గా టీటీడీకి పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
నేడు ఆనం సమీక్ష...
ఈరోజు ఉదయం 11 గంటలకు తిరుమలలో టీటీడీ చైర్మన్ మరియు ఉన్నతాధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమీక్షా సమావేశంలో టీటీడీ పరిపాలన, అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాల తీసుకోవాల్సిన జాగ్రత్త లు, పై సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వినయ్ చంద్, దేవదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, మరియు టీటీడీ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారిదర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,217 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,155 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.84 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.