Tirumala : తిరుమలలో తగ్గని రష్.. అసలు రీజన్ ఇదేనట

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు.

Update: 2025-07-08 03:07 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. సహజంగా సోమవారం నుంచి గురువారం వరకూ తిరుమలకు భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ గత రెండు నెలలకు పైగానే స్వామి వారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుండటంతో తిరుమలలో రద్దీ పెరిగింది. జూన్ నెలలో కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంది. జులై నెలలోనూ ఇప్పటి వరకూ ఏ మాత్రం రద్దీ తగ్గలేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

బయట వరకూ క్యూ లైన్లు...
సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు వారాలతో సంబంధం లేకుండా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. విద్యాసంస్థలు ప్రారంభమయినా సరే భక్తులు రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు కాలి నడకన మొక్కులు చెల్లించుకునే భక్తులతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండి పోయి బయట వరకూ క్యూలైన్లు గత కొద్ది రోజులుగా విస్తరించి ఉన్నాయి.
హుండీ ఆదాయం ఘనం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఎన్.జి. షెడ్ల వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,081 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,775 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.48 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News