Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు.

Update: 2025-06-11 03:20 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. గత నెల పదిహేనో తేదీ నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువయింది. రేపటి నుంచి వేసవి సెలవులు పూర్తి కానుండటంతో ఈరోజు తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో పాటు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకున్న వారు సయితం తిరుమలేశుడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. దీంతో అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.

అలిపిరి నుంచి...
అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ కనిపిస్తుంది. టోల్ గేట్ వద్దనే వాహనాలు, వస్తువుల తనిఖీ గంటల సమయం పడుతుంది. అనేక వాహనాలు టోల్ గేట్ వద్ద నిలిచిపోయాయి. దీంతో పాటు తిరుమలకు కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, సిఫార్సు లేఖల ద్వారా వచ్చిన వారికి కూడా దర్శనం కల్పిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే ఎంత మంది వచ్చినా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దాదాపు ఎన్.జి. షెడ్స్ వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,894 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,508 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News