Tirumala : తిరుమలలో నేడు కూడా తగ్గని భక్తుల రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఎంత మాత్రం తగ్గలేదు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఎంత మాత్రం తగ్గలేదు. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేసవి సెలవులు ముగియనుండటంతో ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో గత పది రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతన్నాయి. గోవింద నామస్మరణలతో మారు మోగిపోతున్నాయి.తిరుమలలో వేసవి రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సామాన్య భక్తులకు...
తిరుమలకు వివిధ మార్గాల్లో భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారితో పాటు శ్రీవాణి టికెట్లు పొందిన వారు, ఎస్.ఎస్.డి టోకెన్లు రోజు వారీ ఇస్తుండటంతో వాటిని తీసుకున్న భక్తులతో పాటు కాలినడకన వచ్చేభక్తులతో తిరుమల నిత్యం కిటకిటలాడుతుంది. ఇక విద్యాసంస్థలు తెరిచే సమయం దగ్గరపడుతుండటంతో ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటున్నారు. అదే సమయంలో పరీక్ష ఫలితాలు కూడా రావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్యభక్తులకు సత్వరం దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. దీంతో ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 83,542 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,265 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.11 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.