Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తులు రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శనివారం అంటే ఏడుకొండల వాడికి మహా ఇష్టమైన రోజుకావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు శనివారం వస్తుంటారు. శనివారం తిరుమలకు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటే చాలు అని తృప్తి పడతారు. శనివారం మొక్కులు మొక్కుకున్నా అవి తీరతాయన్న నమ్మకం ఎక్కువ మంది భక్తులలో ఉంది. అందుకే శనివారానికి, తిరుమలకు మధ్య అంత ప్రత్యేకత ఉంది. శనివారం భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం.
క్యూ లైన్ లో ఉన్న భక్తులకు...
భక్తులు సంఖ్య పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగానే శనివారం దర్శనం కోసం బుక్ చేసుకున్నభక్తులతో పాటు రోజువారీ ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకుని భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తిరుమల వీధులన్నీభక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. శనివారం వచ్చినభక్తులు ఆదివారం కూడా తిరుమలలోనే ఉండి తమ మొక్కులు తీర్చుకుంటారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు మజ్జిగ, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
పది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,327 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.