Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. క్యూ లైన్లలోనే గంటల సమయం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారమయినా భక్తుల రద్దీ కొనసాగుతుంది

Update: 2025-07-15 04:27 GMT

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారమయినా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇప్పటికే కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మాత్రమే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. దీంతో భక్తులు క్యూ లైన్ లోనే వేచి ఉన్నారు. అష్టదళపాద పద్మారాదన సేవను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు.

భక్తులకు మెరుగైన సౌకర్యం కోసం...
మరొక వైపు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలను కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సరికొత్త కాటేజీ విధానాన్ని రూపొందించబోతోంది. ఈ మేరకు టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు కసరత్తు చేపట్టారు. కొత్త కాటేజీల విధానం ఎలా ఉండాలనే విషయంపై సమీక్ష సైతం నిర్వహించారు. తిరుమలలో కాటేజీల నిర్వహణ కోసం నూతన విధానాన్ని తయారు చేయాలని శ్యామలరావు అధికారులను ఆదేశించారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా దాతలు కాటేజీలు నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి వీలుగా విధాన పరమైన బ్లూ ప్రింట్ ను తయారు చేయాలని అన్నారు.
ఇరవై నాలుగు గంటలు...
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కంపార్ట్ మెంట్నన్నీ భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 సమయం పడతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కంపార్ట్ మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం ఏడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,149మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.72 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News