Rk Roja : రోజాను అరెస్ట్ చేస్తారా? అధికార వర్గాలు ఏమంటున్నాయి?

మాజీ మంత్రి ఆర్కే రోజాపై కూటమి ప్రభుత్వం గుర్రుగా ఉంది

Update: 2026-04-10 08:58 GMT

మాజీ మంత్రి ఆర్కే రోజాపై కూటమి ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక తర్వాత యాక్షన్ లోకి దిగే అవకాశాలున్నాయని సమాచారం. ఇటీవల ఆర్కే రోజా రాజకీయంగా యాక్టివ్ కావడంతో కూటమి ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు చేస్తున్నారు. నలభై కోట్లకు పైగానే ఈ ఆడుదాం ఆంధ్ర్ర కార్యక్రమంలో అవినీతి జరిగిందిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు తేల్చి చెప్పింది.

దూకుడుగా వ్యవహరిస్తున్న...
తెలుగుశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆర్కే రోజా అనంతరం జగన్ పార్టీలో చేరారు. నగరి నియోజకవర్గంలో రెండు సార్లు విజయం సాధించారు. మూడోసారి మాత్రం 2024 ఎన్నికల్లో గాలి భాను ప్రకాష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆర్కే రోజాపై చర్యలు తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఒకే పనిగా పోస్టులు పెడుతున్నారు. అయితే మహిళ కావడంతో నిజాలను పూర్తిగా చట్టం ముందు పెట్టకుండా ఆషామాషీగా చర్యలు తీసుకుంటే అభాసుపాలయ్యేది ప్రభుత్వమే. అందుకే ఆచి తూచి ఆర్కే రోజా వ్యవహారంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది.
విజిలెన్స్ నివేదికతో....
ఆర్కే రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పడు తొలి రెండున్నరేళ్లు ఏపీఐఐసీ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసి తర్వాత టూరిజం, క్రీడల శాఖ మంత్రిగా పదవి బాద్యతలను చేపట్టారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరిట వైసీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రమంతటా క్రీడా సంబరాలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆడుదాం ఆంధ్రపేరిట నలభై కోట్ల రూపాయలు దారి మళ్లాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక ఇవ్వడంతో రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటు న్నట్లుంది. త్వరలోనే రోజాను అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదన్నది అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.


Tags:    

Similar News