Chandrababu : పదవులు పణంగా పెడతారా? చంద్రబాబు పై నేతలు, కార్యకర్తల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వత్తిడి పెరుగుతుంది

Update: 2025-04-17 07:18 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వత్తిడి పెరుగుతుంది. బీజేపీ ముందు మోకరిల్లడం మాని టీడీపీ బలం పెంచుకునే ప్రయత్నం చేయాలని సోషల్ మీడియాలో పెద్దయెత్తున కామెంట్స్ వినపడుతున్నాయి. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు వరసగా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయంలో టీడీపీకి రాజ్యసభలో చోటు లేకుండా పోయింది. పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజ్యసభలో అస్సలు ప్రాతినిధ్యం అనేది లేకపోవడం అప్పట్లోనే జరిగింది. అయితే 2024లో మంచి మెజారిటీతో విజయం సాధించిన తర్వాత ఇక వరసగా ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలన్నీ తమ ఖాతాలోనే పడతాయని టీడీపీ నేతలు భావించారు. ఆశలు పెట్టుకున్నారు.

ఒకటి బీజేపీకి...
అయితే ఇటీవల వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీతో పాటు రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేస్తే అందులో రెండింటిని మాత్రమే టీడీపీ తీసుకుంది. మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర యాదవ్, ఆర్. కృష్ణయ్యలు రాజీనామా చేయడంతో ఆ ఖాళీల్లో ఆర్ కృష్ణయ్య తిరిగి బీజేపీలో చేరి రాజ్యసభ కు ఎంపికయ్యారు. టీడీపీకి రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. తాజాగా విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయింది. ఈ స్థానం తమకే వస్తుందని టీడీపీ నేతలు ఎప్పటి నుంచో ఆశలు పెంచుకున్నారు. కానీ చంద్రబాబు వైఖరిని చూస్తుంటే ఈ పదవి కూడా బీజేపీకి ఇచ్చే అవకాశాలున్నాయనిపిస్తుంది.
టీడీపీ బలపడేది ఎట్లా?
ఇలా ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలను బీజేపీకి ఇచ్చుకుంటూ పోతే రాజ్యసభ లో టీడీపీ బలపడేది ఎట్లా? అని టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. త్యాగానికి అయినా ఒక అర్థం ఉండాలని, ఎమ్మెల్సీ నుంచి రాజ్యసభ స్థానం వరకూ అన్నీ కమలం పార్టీకి ఇచ్చి కూర్చుంటే పార్టీని ఇన్నేళ్లుగా నమ్ముకున్న తమ గతేంకానంటూ కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఇంత త్యాగం అవసరమా? అని కూడా కొందరు కార్యకర్తలు చంద్రబాబును నిలదీస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపితో టీడీపీకి ఎంత అవసరముందో? అంతే అవసరం బీజేపీకి కూడా టీడీపీతో ఉందన్న విషయాన్ని మర్చిపోతే ఎలా అని అంటున్నారు.
పదవును పణంగా పెట్టి...
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల కోసం పార్టీ పదవులను త్యాగం చేయడం ఎంత వరకూ సబబని కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో అనేక మంది తమ సీట్లను త్యాగాలు చేసి టిక్కెట్లు దక్కకపోయినా పార్టీ కోసం పనిచేశారని, వారికి వచ్చిన అవకాశాన్ని ఇవ్వకుండా, బీజేపీకి సమర్పించుకోవడం ఏంటని కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఇలాగే జరిగితే పదవులపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు డీలా పడతారంటున్నారు. సీనియర్ నేతలు ఎందరో పెద్దల సభకు వెళ్లాలని క్యూ లో ఉన్నప్పటికీ ఖాళీ అవుతున్న స్థానంలో తమకు దక్కేలా చేయకుండా రాష్ట్రాభివృద్ధి అంటూ పదే పదే పాట పాడుతూ పదవులను పణంగా పెట్టడమేంటని నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మరి చంద్రబాబు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.



Tags:    

Similar News