Telangana : ఈసారి కూడా రెడ్లకు ఆశాభంగమేనా? మళ్లీ భర్తీ చేసినా వీరి పేర్లు పరిశీలనలో ఉండవా?

తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు నిరంతరం వేడిపుట్టిస్తూనే ఉంటాయి. మంత్రి వర్గ విస్తరణ అధినాయకత్వం ఎలాగోలా పూర్తి చేసింది

Update: 2025-07-13 12:19 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు నిరంతరం వేడిపుట్టిస్తూనే ఉంటాయి. మంత్రి వర్గ విస్తరణ అధినాయకత్వం ఎలాగోలా పూర్తి చేసింది. రేవంత్ రెడ్డి కేబినెల్ లో మొన్నటి వరకూ మొత్తం ఆరు పోస్టులు ఖాళీగా ఉండగా అందులో మూడింటిని మాత్రమే భర్తీ చేశారు. ఎస్సీలో మాల, మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలతో పాటు బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు ఇచ్చారు. మంత్రివర్గం విస్తరణ జరిగిన వెంటనే కొంత అసంతృప్తులు బయటకు వచ్చినప్పటికీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షినటరాజన్ లు అసంతృప్త నేతలను బుజ్జగించారు. స్థానికసంస్థల ఎన్నికల తర్వాత మిగిలిన మూడు పోస్టులను భర్తీ చేస్తామని పార్టీ హైకమాండ్ చెబుతుంది.

నియోజకవర్గానికే పరిమితమవుతూ...
అయితే తనకు మంత్రి పదవి దక్కని నేతలు మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. తమ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నారు. అంతే తప్ప తాము రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వారు స్పందించడం లేదు. భవిష్యత్ లోనూ మంత్రి పదవి దక్కతుందన్న గ్యారంటీ మాత్రం లేదని తెలిసిన తర్వాత పూర్తిగా నిరుత్సాహంలో పడిపోయారు. అందులో ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. ఆయన తనకు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని భావించారు. ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అనేక కారణాల వల్ల ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.
కోమటిరెడ్డి ఆశలు...
తనకు మంత్రి పదవి వస్తుందని, హోంమంత్రి పదవి ఆశిస్తున్నట్లు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో అన్నారంటే ఆయన ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారో అర్థమవుతుంది. తనతో పాటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన గడ్డం వివేక్ కు మంత్రి పదవి దక్కినా తనకు దక్కకపోవడానికి ప్రధాన కారణం రెడ్డి సామాజికవర్గమేనని అందరికీ తెలుసు. దీంతో పాటు జిల్లా కూడా ఒక కారణం. ఇప్పటికే నల్లగొండ జిల్లా నుంచి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. మరో పదవి ఇవ్వాలంటే ఒక కుటుంబంలో ఇద్దరికి అనేది పార్టీ హైకమాండ్ కు కూడా ఇబ్బందికరంగా మారింది. అందువల్లనే మొన్న మంత్రి వర్గ విస్తరణలో రెడ్డి సామాజికవర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.
మిగిలిన మూడు పోస్టులు కూడా...
ఇక ఇప్పుడు త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. మంత్రివర్గంలో ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారు లేరు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రానున్న మూడు పోస్టులు కూడా ప్రాంతాల పరంగా, సామాజికపరంగా ఇతరులకు కేటాయించే అవకాశముందన్న సమాచారం అందడంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారని తెలిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వరకూ కొంత సంయమనాన్ని పాటించి తర్వాత రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్ల గక్కే అవకాశముంది. చూస్తుంటే ఆ మూడు పోస్టులను కూడా ఇతర సామాజికవర్గాలకు, బలహీనవర్గాలకు కేటాయించి రెడ్ల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలన్న యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న రెడ్డి సామాజికవర్గం నేతలకు మాత్రం ఈసారి కూడా ఆశాభంగమే ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News