రాజకీయ వారసత్వం కోసం...
సాధారణంగా తండ్రి మరణించిన వెంటనే రాజకీయ వారసత్వం కోసం కొందరు పోటీ పడతారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూడా ఇందిరా గాంధీ మృతి తర్వాత రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ మరణం తర్వాత రాహుల్ గాంధీ వారసులుగా నిలిచారు. మేనకా గాంధీ వారసత్వంపై విభేదించారు. మేనకాగాంధీ తన వారసుడిగా వరుణ్ గాంధీని రంగంలోకి దించారు. అయితే చివరకు రాజకీయ వారసత్వం సోనియాగాంధీ ఇంటికి చేరుకుంది. మేనకా గాంధీ బీజేలో చేరిపోయారు. ఇక ప్రియాంక ఉన్నప్పటికీ ఆమె వారసత్వం జోలికి పోలేదు. అన్న రాహుల్ గాంధీ మాత్రమే వారసత్వం చేపట్టాలని చెబుతుంది. తమిళనాడులో కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్, ఆళగిరి మధ్య వారసత్వ పోరు ప్రారంభమయినా పార్టీతో పాటు అధికారం కూడా స్టాలిన్ చేతుల్లోకి వచ్చింది. ఆళగిరి కనిపించడం లేదు.
జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో...
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆయనను జనం ఆదించారు. 2019 ఎన్నికల్లో అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఇప్పుడు వైఎస్ వారసుడు వైఎస్ రాజారెడ్డి అంటూ తన కుమారుడిని రంగంలోకి దించారు. అయితే రాజారెడ్డి ఇంటిపేరు వైఎస్ కాదంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్దయెత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. తన భర్త ఇంటి పేరు కుమారుడికే వస్తున్నా వైఎస్ ట్యాగ్ లైన్ వదలడానికి షర్మిల ఇష్టపడటం లేదు. తన కుమారుడికి రాజారెడ్డి అని వైఎస్ నామకరణం చేశారంటూ గుర్తు చేస్తున్నారు. అయితే రాజారెడ్డిని గుర్తించాల్సింది వైఎస్ కుటుంబ సభ్యులు కాదు.. షర్మిల అభిమానులు కాదు.. వైసీపీ వీరాభిమానులు కూడా కాదు. రాజారెడ్డి రాజకీయ ప్రవేశం చేసి వస్తే ఆయనను నేతగా గుర్తించాల్సింది ప్రజలు మాత్రమేనన్న విషయం మరిచిపోయి వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. పదవి ఉన్నా లేకున్నా ఆయన పార్టీని వీడలేదు. చివరకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి షిఫ్ట్ అయింది. అంటే వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఎక్కువ మంది వైఎస్ వారసుడిగా నాడు జగన్ ను గుర్తించారు. ఇప్పుడు కూడా రాజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వారసుడిగా షర్మిల ప్రకటించుకుంటే చాలదు. రేపు రాజారెడ్డి జనంలోకి వచ్చినప్పుడు ఆయనకు కనిపించే ఆదరణ, ఆయన సాధించే గెలుపులు వంటివి మాత్రమే వైఎస్ వారసుడు ఎవరన్నది తేల్చనున్నాయి. రాజారెడ్డి ఇంకా రాజకీయాల్లోకి రాకముందే ఆయన చుట్టూ వారసత్వంపై చర్చ జరుగుతుండటం విచిత్రమనే అనుకోవాలి. వైఎస్ షర్మిల కూడా తాను గత ఐదేళ్ల నుంచి సాధించింది రాజకీయాల్లో ఏమీ లేదని, రాజారెడ్డిని కూడా ఈ మురికి కూపంలోకి ఎందుకు తెస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైఎస్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.