Banakacharla : పోలవరమే పూర్తి కాలేదు.. బనకచర్లపై ఇంత రగడ ఏంది సామీ

పోలవరం ప్రాజెక్టు ఇంత వరకూ పూర్తి కాలేదు. బనకచర్ల ప్రాజెక్టు పై వివాదం రాజుకుంది

Update: 2025-06-18 07:54 GMT

పోలవరం ప్రాజెక్టు ఇంత వరకూ పూర్తి కాలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాగా ప్రకటించింది. అయితే 2014లో ఏర్పాటయిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ, 2019 లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కానీ పూర్తి చేయలేకపోయింది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 2027 కల్లా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని చెబుతుంది. అయితే పోలవరం పూర్తికాకముందే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంట పుట్టిస్తుంది. పోలవరమే పూర్తిచేయలేని ప్రభుత్వాలు ఈ బనక చర్ల ప్రాజెక్టును ఏ మేరకు పూర్తి చేస్తాయన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఎనభై వేల కోట్ల రూపాయలు...
బనకచర్ల ప్రాజెక్టు అంచనా వ్యయమే ఎనభై వేల కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పట్లో సహకరించే పరిస్థితి లేదు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతి రాజధాని నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో బనకచర్ల ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు చెబుతున్నప్పటికీ, రాయలసీమకు గోదావరి నీటిని తరలించేందుకు అంటున్నప్పటికీ ఆచరణలో ఎంత వరకూ సాధ్యమన్న కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ లోనే వినిపిస్తున్నాయి. ఎనభై వేల కోట్ల రూపాయల నిధుల సేకరణతో పాటు భూములను రైతుల నుంచి సేకరించడం కూడా ప్రస్తుత ప్రభుత్వానికి బనకచర్లప్రాజెక్టు విషయంలో సవాల్ గా మారనుంది.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు...
బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్‌ షా, సీఆర్‌ పాటిల్‌కు అనేకసార్లు వినతి చేశారు కూడా. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి అడుగుపడింది. బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్ర పర్యావరణ నిపుణుల అంచనాల కమిటీ మంగళవారం సమావేశమయింది.పర్యావరణ అనుమతులపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రొఫెసర్ చక్రపాణి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయ్యింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కమిటీ సమావేశమైంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించింది. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని కమిటీ అంచనా వేయనుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి బనకచర్ల ప్రాజెక్టుపై నివేదిక సమర్పించనుంి.
తెలంగాణ అభ్యంతరాలు...
అయితే బనకచర్ల ప్రాజెక్ట్‌ను అనుమతించకూడదని, రిజెక్ట్ చేయాలంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడి ఈఏసీకి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని తెలిపారు. గోదావరి నీటిని కృష్ణలో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీని వల్ల తెలంగాణ హక్కులను హరించినట్లు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతుంది. మరొక వైపు ప్రస్తుతమున్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షమైన బీఆర్ఎస్ నుంచి కూడా వత్తిడిపెరుగుతంది. ఈ నేపథ్యంలో నేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలవరమే పూర్తి కాకుంటే... బనకచర్లపై ఈ రగడ ఏందని ఏపీ నేతలు అంటున్నప్పటికీ మొత్తం మీద బనకచర్ల పొలిటికల్ గేమ్ ఛేంజర్ గా మారిందనే చెప్పాలి.


Tags:    

Similar News