TDP : ఆరోజు కోసమే పితాని వెయిట్ చేస్తున్నాడటగా

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తన కంటూ ఒక రోజు వస్తుందని బలంగా నమ్ముతున్నారు

Update: 2025-11-05 07:52 GMT

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తన కంటూ ఒక రోజు వస్తుందని బలంగా నమ్ముతున్నారు. తన ప్రధాన అనుచరులకు కూడా ఇదే చెబుతున్నారట. పితాని సత్యనారాయణ సీనియర్ నేతగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సామాజికవర్గానికి బలమైన నేత. ఆయన వెంటే లక్కు ఉంటుందని అందరూ భావిస్తారు. పార్టీ మారినా అధికారంలోకి రావడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇంటికి వచ్చి తలుపుతడుతుందని ఆయన అనుచరులు భావిస్తారు. ఆయన ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే చాలు తమ నేతకు మంత్రి పదవి గ్యారంటీ అని విశ్వసిస్తారు ఆయన అనుచరులు. బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పితాని సత్యనారాయణకు ఈసారి మాత్రం మంత్రివర్గంలో స్థానం దక్కలేదు.

పార్టీలు మారినా...
పితాని సత్యనారాయణ కు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి దక్కింది. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినా చంద్రబాబు పితానికి ఆలస్యంగానైనా మంత్రి పదవి ఇచ్చారు. బలమైన శెట్టి బలిజ సామాజిక వర్గం కావడం, ఆయన సామాజిక వర్గం ఐదారు శాసనసభ నియోజకవర్గాల్లో బలంగా ఉండటంతో ప్రతి పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఎప్పుడూ జరుగుతుంది. పెనుగొండ, ఆచంట నుంచి నాలుగు సార్లు పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రి పదవిని దక్కించుకున్నారు. శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన పితాని సత్యనారాయణ కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఒక వెలుగు వెలిగారు. ఆయన తొలుత వైసీపీలో చేరాలనుకుని 2014లో ఆయన టీడీపీలో చేరి తిరిగి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ హవా ముందు ఆయన ఓటమి పాలయినా పార్టీలో ఉండి తిరిగి గెలుపొందారు.
వాసంశెట్టికి ఇవ్వడంతో...
మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గం నుంచి పితాని సత్యనారాయణ గెలిచారు. ఇటు కూటమి కూడా అధికారంలోకి వచ్చింది. కానీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఆయన స్థానంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వాసంశెట్టి సుభాష్ కు మంత్రి పదవి దక్కింది. వాసంశెట్టి సుభాష్ కూడా శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన వారే. దీంతో పితాని సత్యనారాయణకు మంత్రి పదవి దక్కకుండా పోయింది. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన వాసంశెట్టి సుభాష్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని, తమ నేత పితాని సత్యనారాయణకు ఖచ్చితంగా విస్తరణలో కేబినెట్ లో చోటు దక్కుతుందని జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టున్న నేత పితానికి మంత్రి పదవి ఇస్తారా? వాసంశెట్టిని కొనసాగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News