Macharla : జంట హత్యల కేసులో నేడు లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు
ఈరోజు మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు లొంగిపోనున్నారు
ఈరోజు మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంటహత్యల కేసులో A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్నారు. రెండు వారాల్లోగా లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతోనేడు పిన్నెల్లి సోదరులు ఇద్దరూ లొంగిపోన్నారు. సుప్రీంకోర్టు గడువు ముగియడంతో ఈరోజు ఉదయం మాచర్ల కోర్టులో పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోనున్నారు. పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సుప్రీంకోర్టు కొట్టివేయడంతో...
టీడీపీ నాయకులు జె. కోటేశ్వరరావు, జె. వెంకటేశ్వర్ల హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వీరికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను కొట్టేస్తూ ఆగస్ట్ 29న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నవంబర్ 28న సుప్రీంకోర్టు వీరి పిటిషన్ కొట్టివేసింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గురువారం రోజున పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పల్నాడు ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్షన్ 30 అమలులో ఉంటుందని తెతిపారు.
రెండు వారాల గడువు ముగియడంతో...
పిన్నెల్లి సోదరుల పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఛార్జిషీట్లు దాఖలు కాకముందే నిందితులకు కేసు డైరీలోని విషయాలు, 161 స్టేట్‌మెంట్లు తెలియడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగే పిన్నెల్లి సోదరులు లొంగిపోవడానికి గడువు కోరగా సుప్రీంకోర్టు తిరస్కరించింది.అయితే పిటిషనర్ల తరుఫు న్యాయవాదులు కోరటంతో పిన్నెల్లి సోదరుల లొంగిపోయేందుకు సుప్రీంకోర్టు రెండు వారాల పాటు గడువు ఇచ్చింది. అయితే ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పల్నాడు అంతటా పూర్తి స్థాయిలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనలు చేసినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.