Ys Jagan : జగన్ అవకాశాలను తానే చేజార్చుకుంటున్నారా? ఇమేజ్ బిల్డప్ కోసమేనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా జనం వస్తున్నారు. అది చూసి తనకు మళ్లీ అధికారం వస్తుందని నమ్ముతున్నారు

Update: 2025-06-09 08:58 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా జనం వస్తున్నారు. అది చూసి తనకు మళ్లీ అధికారం వస్తుందని నమ్ముతున్నారు. అందుకే కొంత నిర్లక్ష్యం జగన్ లో కనపడుతుంది. ఈసారి కూడా తన ఫేస్ ను చూసి మాత్రమే జనం ఓట్లు వేస్తారన్న నమ్మకంతోనే జగన్ ఉన్నట్లు కనపడుతుంది. ఎందుకంటే నాయకులతో నిత్యం సమావేశాలు జరపడం, సమీక్షలు నిర్వహించుకోవడం వంటి వాటికి జగన్ నాడు- నేడు దూరమే. అంతా నావల్లనే జరగాలన్న ధోరణిలోనే ఇంకా జగన్ ఉన్నట్లు కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలను చేపట్టడం ప్రతిపక్ష పార్టీకి అవసరం. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సింది కూడా ప్రతిపక్షమే.

అనేక కార్యక్రమాలకు పిలుపు నిచ్చినా...
అయితే ఏడాది నుంచి అనేక కార్యక్రమాలకు వైసీపీ పిలుపు నిచ్చింది. కానీ జగన్ మాత్రం అందులో ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. అనేక కార్యక్రమాలు చేపట్టినా జగన్ వాటికి దూరంగా ఉండటం, తాను ఒక్క పిలుపు నిస్తే చాలు అన్న వైఖరి జగన్ లో స్పష్టంగా కనపడుతుంది. ఏడాది నుంచి జగన్ రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో బయటకు రావడం, అక్కడక్కడా పరామర్శలు, భరోసా యాత్రలు, వివాహాది శుభకార్యాలకు హాజరు కావడం మినహా జగన్ నేరుగా ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొనింది లేదు. అధికారంలోకి రానప్పుడు జగన్ దీక్షలు, ధర్నాలు స్వయంగా చేస్తూ జనానికి దగ్గరయ్యారు. కానీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
వెన్నుపోటు దినం జరిపినా...
ఈ నెల 4వ తేదీన ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదంటూ వెన్నుపోటు దినం అని జగన్ ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది. అది కూడా అందరూ నేతలు ఇందులో పాల్గొనాలని కోరారు. తాను మాత్రం బెంగళూరులో ఉన్నారు. ఇది క్యాడర్ లోనూ, ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు వెళుతుందని నేతలు చెబుతున్నారు. అదే జగన్ ఏదో ఒక జిల్లాలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొని ఉంటే కార్యక్రమానికి మంచి హైప్ వచ్చేదని, మీడియా అటెన్షన్ కూడా వచ్చేదని, జగన్ చేజేతులా ఈ అవకాశాలను తానే దూరం చేసుకుంటున్నారని సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారంటే జగన్ కు అర్థం కావడంలేదా?
క్రెడిట్ తన ఖాతాలోనే...
జగన్ కూడా ఎన్నికలకు కొద్ది రోజులు ముందు మాత్రమే జనంలోకి రావాలని అనుకుంటున్నట్లుంది. అప్పటి వరకూ అడపా దడపా ఏవో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లడమే మంచిదని భావిస్తున్నారు. నేతలు, క్యాడర్ ను ముందుగా రోడ్డు మీదకు తీసుకు వచ్చి వారిని యాక్టివ్ చేసిన తర్వాత మాత్రమే తాను రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లుంది. తాను హాజరయిన కార్యక్రమం సూపర్ సక్సెస్ కావాలని, అది అధికారాన్ని మళ్లీ తెచ్చె పెట్టేలా ఉండాలన్న ఆలోచనతోనే ఆయన ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లుందని పార్టీకి చెందిన సీనియర్ నేతలే అంటున్నారు. అంటే ఒకవేళ గెలిస్తే క్రెడిట్ తన ఖాతాలో పడేలా జగన్ వ్యవహరిస్తున్నారని, అది మంచిది కాదని కొందరు వైసీపీ సానుభూతి పరులు కూడా సూచిస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఉన్న పరిస్థితులను, నాడు చేసిన కార్యక్రమాలను గుర్తు చేసుకోవాలని కోరుతున్నారు.

జూ"నియర్" టు పాలిటిక్స్
Junior Ntr : జూనియర్ రాజకీయాల్లోకి వస్తారా? రమ్మంటే రావడానికి ఇది సమయమా?


Tags:    

Similar News