Pawan Kalyan : పక్షం రోజులవుతున్నా పెద్దిరెడ్డి విషయం తేల్చరా?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటన చేసి దాదాపు పక్షం రోజులు గడుస్తుంది.

Update: 2025-11-28 07:56 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటన చేసి దాదాపు పక్షం రోజులు గడుస్తుంది. ఈ నెల 12వ తేదీన ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఎర్రచందనం దుంగలను పరిశీలిచండంతో పాటు మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణను బయటపెట్టారు. హెలికాప్టర్ లో వెళుతూ పెద్దిరెడ్డి ఆక్రమించిన ప్రాంతాన్ని వీడియో తీసి నెట్టింట వదిలేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి దాదాపు 76.74 ఎకరాల అటవీభూములను ఆక్రమించుకుందని ఆయన వీడియోద్వారా చెప్పారు. అక్కడ అటవీ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా తాము విడిదిచేయడానికి చిట్టడవిలో గెస్ట్ హౌస్ ను నిర్మించుకోవడం, అక్కడకు వెళ్లేందుకు అవసరమైన దారిని ఏర్పాటు చేసుకోవడం, చెట్లను నరికివేయడం వంటి వాటిని పవన్ కల్యాణ్ స్వయంగా చిత్రీకరించి ఆ వీడియోను బయటపెట్టారు.

మంగళంపల్లి అటవీభూముల ఆక్రమణలకు...
దీంతో మంగళంపల్లి అటవీ భూముల ఆక్రమణ విషయంలో అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే పెద్దిరెడ్డి అప్పటికే దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. మరొకవైపు మిధున్ రెడ్డి కూడా పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు. తాము అటవీ భూములను ఆక్రమించుకోలేదని, అవి 2009లోనే తాము చట్టపరంగా స్వాధీనం చేసుకున్న భూములని చెప్పుకొచ్చారు. త్తూరు జిల్లా మంగళంపేటలోని అటవీ భూముల ఆక్రమణకు సంబంధించిన కేసులో తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ భూములను చట్టబద్ధంగానే సేకరించారని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలను నిరూపించాలని వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కోర్టుల వల్లనేనా?
అయితే మంగళంపల్లి అటవీ భూములకు సంబంధించి తాజాగా ఇంత వరకూ అప్ డేట్ లేదు. కనీసం తాను చేసిన ఆరోపణలపై పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్ష చేయకపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆరోపణలు చేసినప్పుడు వాటిని నిరూపించడంతో పాటు నిజంగా అటవీ భూములను ఆక్రమిచుకున్న వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ హైకోర్టులో ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురైనా సుప్రీంకోర్టులో సవాల్ చేసే వీలుందని, ఇలా ఆరోపణలు చేయడం తర్వాత వాటిని మర్చిపోవడంపై పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతుంది. అటవీ భూములను ఆక్రమించుకున్న వారిని ఎవరినైనా వదిలిపెట్టవద్దని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.అదే సమయంలో అటవీ భూములను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మరి ఈ కేసు ఎక్కడ ఆగిందోనని జనసేన నేతలు భావిస్తున్నారు.


Tags:    

Similar News