Tirupathi : పాత వాసనలు పోవడం లేదా? ఆరణికి ముందున్నవి కష్టాలేనా?

తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తుంది

Update: 2025-10-03 07:53 GMT

తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరినా ఆరణి శ్రీనివాసులకు తిరుపతి నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు. టీడీపీ బలంగా ఉన్నప్పటికీ, అక్కడ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తనకు కావాలని గట్టిగా కోరినప్పటికీ పవన్ కల్యాణ్ తిరుపతి నియోజకవర్గం సీటును పట్టుబట్టి జనసేన ఖాతాలో వేసుకున్నారు. పొత్తులో భాగంగా రాయలసీమలోని తిరుపతితో పాటు రైల్వే కోడూరు నియోజకవర్గాలను ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా నాడు పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించారు. దీంతో కూటమి గాలిలో ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

వైసీపీ నుంచి జనసేనలోకి
గతంలో చిత్తూరు ఎమ్మెల్యేగా వైసీపీలో ఉన్న ఆయన పార్టీ మారి తిరుపతి జనసేన ఎమ్మెల్యే అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరణి శ్రీనివాసులు పార్టీ క్యాడర్ ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన క్యాడర్ ను పక్కన పెట్టి కొందరు వైసీపీ నేతలకు టచ్ లో ఉన్నారంటూ ఆరో్పణలు పలు దఫాలు ఎదుర్కొన్నారు. జనసేన నాయకులే ఆరణి శ్రీనివాసులుపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మరొకవైపు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కూడా ధీటుగా ఆరణి శ్రీనివాసులు స్పందించక పోవడం కూడా ఆరణిపై ఆగ్రహానికి కారణమయిందంటున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నప్పటికీ పాత పరిచయాలతో ఆరణి శ్రీనివాసులు స్పందించడం లేదన్న అనుమానం పార్టీ నాయకత్వంలో వక్తమవుతుంది.
క్లాస్ పీకిన పవన్...
ఇటీవల తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లాస్ పీకారని తెలిసింది. ఇలాగైతే ఎలా.. కూటమిలోని మూడు పార్టీల కార్యకర్తలను కలుపుకుని పోవాలని పవన్ కల్యాణ్ చెప్పారట. పాత పరిచయాలుంటే వాటిని వదిలేయాలని, జనసేనలో కొనసాగాలనుకుంటే మారాలని ఆరణి శ్రీనివాసులుకు పవన్ కల్యాణ్ ఒకింత సీరియస్ గానే చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆరణి శ్రీనివాసులు ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి చేసే విమర్శలకు స్పందిస్తున్నారనితెలిసింది. మరొకవైపు తిరుపతి నియోజకవర్గంలోని జనసేన నేతల నుంచి కూడా పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు ఆరణి శ్రీనివాసులుపై పవన్ కల్యాణ్ ఒక కన్నేసి ఉంచినట్లు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆరణి శ్రీనివాసులుకు టిక్కెట్ దొరుకుతుందా? అన్న డౌట్ కూడా పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News