Pawan Kalyan : జగన్ కుడిభుజాన్ని టార్గెట్ చేసిన పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని గుట్టు బయటపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని గుట్టు బయటపెట్టారు. దాదాపు 76.74 ఎకరాల అటవీభూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించుకుందని ఆయన కళ్లకు కట్టినట్లు చూపించారు. అక్కడ అటవీ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా తాము విడిదిచేయడానికి చిట్టడవిలో గెస్ట్ హౌస్ ను నిర్మించుకోవడం, అక్కడకు వెళ్లేందుకు అవసరమైన దారిని ఏర్పాటు చేసుకోవడం, చెట్లను నరికివేయడం వంటి వాటిని పవన్ కల్యాణ్ స్వయంగా చిత్రీకరించి ఆ వీడియోను బయటపెట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటనలో ఈ వీడియోను చిత్రీకరించారు.
మంగళంపల్లి అటవీ భూములను...
పవన్ కల్యాణ్ మంగళంపల్లి అటవీ భూములకు సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. అటవీ భూములను ఆక్రమించుకుని గెస్ట్ హౌస్ లను కట్టుకున్న తీరును ఆయన వీడియో తీసి మరీ బయటపెట్టారు.ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ హెలికాప్టర్ లో వెళుతూ తన సెల్ ఫోన్ లో ఈ వీడియోను చిత్రీకరించారు. అటవీ భూములను ఆక్రమించుకుని వైసీపీనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అటవీ భూములను ఆక్రమించుకున్న వారిని ఎవరినైనా వదిలిపెట్టవద్దని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.అదే సమయంలో అటవీ భూములను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
జగన్ కు అత్యంత సన్నిహితుడు...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు, కుడిభుజమైన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణల వ్యవహారం ఎప్పుడో బయటకు వచ్చింది. అయితే అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేసినా అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. అయితే పవన్ కల్యాణ్ తాజాగా విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వ అధికారుల్లోనూ కదలిక రావాలనే పవన్ కల్యాణ్ ఈ వీడియోను విడుదల చేసినట్లు కనపడుతుంది. గతంలో కేసు నమోదు చేసినా ముందుకు కదలకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న అటవీ భూములను ఆయన ఎక్స్ వేదికగా బయటపెట్టారు. వెంటనే చట్టపరమైన చర్యలు సంబంధిత వారిపై తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. మరిపవన్ కల్యాణ్ ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయన్నది చూడాల్సిందే.