Pawan Kalyan : అలా అయితేనే వాళ్లు దిగివస్తారు.. లేకుంటే ఆడిస్తారనేనా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనంగా ఉంటూనే తన పని చేసుకు పోతున్నట్లు కనిపిస్తుంది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనంగా ఉంటూనే తన పని చేసుకు పోతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆవేశాలకు లోనయి అనవసర రాజకీయ రచ్చకు కారణమవ్వదలచుకోలేదు. కూటమిలో మిత్రపక్షంగా ఉన్న తమ పార్టీ బలోపేతమయిదే వాళ్లే దిగి వస్తారన్న అంచనాలో పవన్ కల్యాణ్ ఉన్నారు. మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటే తప్ప తాము కోరినన్ని స్థానాలు సాధించే అవకాశం లేదని ఆయన గ్రహించినట్లుంది. ఇలాగే ఉంటే ఆ 21 నియోజకవర్గాలకే తమను వచ్చే ఎన్నికలకు కూడా పరిమితం చేసే ప్రమాదం లేకపోలేదన్న సంకేతాలు ఆయనకు అందాయని అంటున్నారు.
మిత్రధర్మాన్ని పాటిస్తూనే...
జగన్ ను ఏ ఎన్నికల్లోనైనా ఎదుర్కొనాలంటే కూటమి బలంగా ఉండాలి. కలసి ఉండాలి. మిత్ర ధర్మాన్ని అందరూ పాటించాల్సిందేనని పవన్ కల్యాణ్ నమ్ముతున్నారు. అందుకోసమే మాటల్లో కాకుండా చేతల్లో చూపించినప్పుడే తమకు విలువ ఉంటుందని భావించి ఇక నేరుగా రంగంలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో కేవలం 21 నియోజకవర్గాలకు మాత్రమే జనసేన పోటీ చేసి అన్నింటిలో విజయం సాధించింది. రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ గెలిచింది. అయితే అదే మాషా ప్రకారం తమపార్టీకి నామినేటెడ్ పదవులు దక్కుతుండటంతో జనసైనికుల్లో కొంత అసహనం ఏర్పడింది. జనసైనికులు అనేక నియోజకవర్గాల్లో పదవులు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు.
పార్టీని బలోపేతం చేసే దిశగా...
ఇది గమనించిన పవన్ కల్యాణ్ పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్ పర్యటనలు సాగనున్నాయి. జిల్లాల పర్యటన షెడ్యూల్ ఉపముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వెళ్లనున్న పవన్‌కల్యాణ్ అస్వస్థతకు గురైన విద్యార్థుల గురుకుల పాఠశాలను పరిశీలించనున్నారు. విద్యార్థినులతో మాట్లాడతారు. రేపు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఉప్పాడ మత్స్యకారులతో సమావేశం కానున్నారు. తర్వాత ప్రకాశం జిల్లాలోనూ పవన్ పర్యటన ఉండనుంది. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతోనే ఆయన భేటీలు జరగనున్నాయి. గ్రౌండ్ లెవెల్ లో నాయకత్వం బలహీనంగా ఉంటే కూటమిలోని పార్టీలు కూడా తమను ఆడించే అవకాశముందని భావించిన పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనలను ఎంచుకుంటున్నట్లు కనపడుతుంది.