Janasena : జనసేన ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహంగా ఉన్నారా?
యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది
యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తరచూ వివాదాల్లో చిక్కుకోవడం ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడంతో ఆయన పనితీరుపై అనేక ఫిర్యాదులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఫిర్యాదులు అందాయి. వరసగా వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా ఇసుక, మద్యం వంటి విషయాల్లో సుందరపు విజయ్ కుమార్ పేరు తరచూ వస్తుండటంతో ఆయనపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. వారికే సమస్యగా మారితే ఎలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించినట్లు తెలిసింది. సుందరపు విజయకుమార్ పనితీరుపై తనకు పూర్తి స్థాయి నివేదిక కావాలని పవన్ కోరినట్లు సమాచారం.
తొలిసారి ఎమ్మెల్యే అయి...
సుందరపు విజయ్ కుమార్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో యలమంచిలి నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు పై 48956 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా పూడిమడికలో సుందరపు విజయకుమార్ ను గ్రామస్థులు నిలదీశారు. పెద్దయెత్తున ప్రజలు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కు అడ్డుపడి ప్రశ్నించడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేను - నా యువత కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుందరపు విజయకుమార్ ను యువకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు.
పూడిమడకలో తిరుగుబాటు...
పూడిమడిక శివారులో చేపడుతున్నఎన్టీపీసీ పనులను నిలిపివేయాలని, పెండింగ్ ప్యాకేజీలు అమలు చేయాలని, సెజ్ కంపెనీల్లో పూడిమడిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అయితే వాటిని పట్టించుకోకపోవడంతో యువకులు తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లారు. ఇలా వరస వివాదాలతో పాటు ప్రజలకు నచ్చ చెప్పడంలో సుందరపు విజయకుమార్ విఫలమవుతున్నారని, పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చిపెడుతున్నారని భావించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్న పవన్ కల్యాణ్ సుందరపు విజయకుమార్ ను పిలిచి మాట్లాడాలని నిర్ణయించినట్లు తెలిసింది.