YSRCP : గన్నవరం వైసీపీ బాధ్యతలు అప్పగింతలు పూర్తయినట్లేనా?

గన్నవరం వైసీపీకి కొత్త జవసత్వాలు తేవడానికి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.

Update: 2025-05-31 06:36 GMT

గన్నవరం వైసీపీకి కొత్త జవసత్వాలు తేవడానికి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ, ఇసుక, మైనింగ్ కేసులతో పాటు అనేక కేసుల్లో గత వంద రోజుల నుంచి జైలులోనే ఉన్నారు. గన్నవరం వైసీపీకి ఏడాది నుంచి నాయకత్వం లేదు. వల్లభనేని వంశీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన అనేక ఆరోగ్యకరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ బయటకు వచ్చినప్పటికీ ఇపట్లో ఆయన గన్నవరం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం లేదు.

అదే నాయకత్వం అంచనా...
అందుకే వైసీపీ నాయకత్వం గన్నవరం నియోజకవర్గ బాధ్యతలను వల్లభనేని వంశీ భార్యకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. పంకజశ్రీ ని ముందు పెట్టి గన్నవరం రాజకీయాలను నడిపించాలని వైసీపీ నాయకత్వం డిసైడ్ అయింది. పంకజశ్రీ ఈరోజు గన్నవరం వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నారు. ఆమెతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని కూడా గన్నవరం నియోజకవర్గానికి వెళతారు. కార్యకర్తల్లో భరోసాను నింపడానికి, వారిలో ఆత్మస్థయిర్యం నింపేందుకు వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీకి పగ్గాలు అప్పగిస్తేనే మంచిదని వైసీపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గన్నవరం బాధ్యతలు ఆమెకు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సానుభూతి వస్తుందని...
గత వంద రోజుల నుంచి వల్లభనేని వంశీ జైలులో ఉండటంతో పాటు ఆయనపై అనేక కేసులు వరసగా పెడుతుండటంతో సానుభూతి పెల్లుబుకుతుందని వైసీపీ అంచనా వేస్తుంది. వల్లభనేని వంశీని చూసిన వారికి జాలి కలుగుతుందన్నభావన పార్టీలో వ్యక్తమవుతుంది. అందుకే వంశీ ప్లేస్ లో ఆయన భార్యకు నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తే కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహం పెరగడంతో పాటు గన్నవరంలో పార్టీ బలోపేతం అవుతుందని వైసీపీ అధినాయకత్వం అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకుంది. పంకజ శ్రీ కూడా తన భర్త తిరిగి మామూలు మనిషి అయ్యేంత వరకూ గన్నవరం బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమయినట్లేకనిపిస్తుంది. గన్నవరం వైసీపీ బాధ్యతలను పంకజశ్రీ ఏ మేరకు సక్సెస్ ఫుల్ గా చేస్తారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News