Andhra Pradesh : మంత్రులకు ఇది హెచ్చరికేనా? పనితీరు మార్చుకోకుంటే ఉద్వాసన తప్పదా?

ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం నుంచి మంత్రుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు అందాయి.

Update: 2025-01-26 06:27 GMT

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు చెమటలు పట్టించే వార్త ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం నుంచి మంత్రుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు అందాయి. అధికారులు ఈ నివేదికను తయారు చేసి పంపాలని కోరడంతో మంత్రుల గుండెల్లో గుబులు బయలుదేరింది. గత కొన్ని మంత్రి వర్గ సమావేశాల నుంచి చంద్రబాబు తమ పనితీరుపై నివేదికలు ఇవ్వాలని పదే పదే చంద్రబాబు కోరుతున్నారు. అయితే ముగ్గురు మంత్రులు మినహా ఎవరూ నివేదికలు అందించలేదు. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మంత్రుల పనితీరుపై తమ కార్యాలయానికి వెంటనే నివేదిక పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది.

యువతకే ప్రాధాన్యత ఇచ్చినా...
ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తన మంత్రివర్గంలో తొలిసారి సీనియర్లను పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యత కల్పించారు. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏడు నెలలు గడుస్తుండటంతో వారి పనితీరును అధ్యయనం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. పనితీరు ఆధారంగానే మంత్రి పదవిలో వారిని కొనసాగించాలా? లేదా? అన్ననిర్ణయం కూడా తీసుకోనున్నారు. అనేక విషయాల్లో మంత్రులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో పాటు కొందరు మంత్రులు తమకు అప్పగించిన శాఖలపై పట్టు సాధించకపోవడంతో పాటు జిల్లాల్లోనూ కూటమి నేతల మధ్య విభేదాలను చక్కబెట్టడంలో విఫమయ్యారన్న అభిప్రాయంతోనే చంద్రబాబు ఈ నివేదికను కోరినట్లు సమాచారం.
ఏడు నెలల కాలంలో...
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గత జులై నుంచి డిసెంబర్ వరకు మంత్రుల పనితీరుపై నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మంత్రులు పాల్గొన్న అధికారిక కార్యక్రమాలతో పాటు శాఖాపరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలు, ఇతర నిర్ణయాల అమలు, పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు వంటి వాటిపై ఆరు నమూనాల ద్వారా పంపాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు, ఒకటి కంటే ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్లు విడిగా సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. రిపోర్టుల ఆధారంగా మంత్రుల పనితీరుకు చంద్రబాబు రేటింగ్ ఇవ్వనున్నారు. గత రెండు కేబినెట్ మీటింగ్ లలోనూ మంత్రుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు చేసినా పట్టించుకోకపోవడంతో తాజాగా ఆదేశాలను ప్రభుత్వం నుంచి రావడంతో మంత్రుల్లో గుబులు బయలుదేరింది. మంత్రులు స్వయంగా నివేదిక ఇవ్వకపోవడంతో ప్రభుత్వం నుంచే ఆయా శాఖలకు నేరుగా సీఎంవో ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News