ఐదు రోజులవుతున్నా.. అందని వైద్య సేవలు
బకాయిలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ హెచ్చరించింది.
ఎన్టీఆర్ వైద్యసేవ నెట్ వర్క్ ఆసుపత్రుల బకాయిలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ హెచ్చరించింది. ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ కారణంగా సుమారు ఎనభై శాతం మంది ప్రభుత్వ వైద్యానికి దూరమవుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేసి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు...
ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా అత్యవసర కేసులకు ఉచిత వైద్యసేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే తమకు మద్దతు తెలిపిన ప్రైవేట్ వైద్యకళాశాలలు రానున్న రోజుల్లో ఆందోళనలో పాల్గొంటాయని వెల్లడించారు. ట్రస్ట్ కు సమర్పించి, సీఈవో ఆమోదించిన 650 కోట్ల రూపాయల బిల్లుల మొత్తం వెంటనే విడుదల చేయాలని, మిగిలిన బకాయిలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపేస్తామని తెలిపారు.