Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మళ్లీ భూ సమీకరణ
అమరావతి రాజధానిలో భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ మేరకు పలు నిబంధనలను విధించింది.
అమరావతి రాజధానిలో భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ మేరకు పలు నిబంధనలను విధించింది. దాదాపు నలభై వేల ఎకరాలను సేకరించే లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ కేబినెట్ కూడా ఆమోదించింది. ఇప్పటి వరకూ సేకరించిన ముప్ఫయి ఐదు వేల ఎకరాలకు తోడు మరో నలభై వేల ఎకరాల భూమిని సేకరించి అదనపు ఆకర్షణలను రాజధానికి అద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ లో నిబంధనలతో పాటు పలు విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది.
నిబంధనలివీ...
ఈ సారి అమరావతి రీజియన్ పరిధిలో పూలింగ్ కు తీసుకునే భూముల్లో అభివృద్ధి బాధ్యత ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వవచ్చు. దానికి కూడా అనుమతి ఇస్తున్నట్లు రైతులు ఆమోద పత్రం మీద సంతకం పెట్టాలి. ఈ పధకం పేరు రాజదాని ప్రాంతం భూ సమీకరణ పధకం 2025గా పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న రాజధాని ప్రాంతం వెలుపల ఈ నిబంధన లు అమల్లో ఉంటాయి. ఇప్పుడు కొత్తగా రైతులకు ఇచ్చే ప్లాట్స్ ఎల్ పి ఓ సి ఇస్తారు. దానికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.ఆధార్ ఓటి్పితో భూమి ఇచ్చే సమయంలో రైతు ఆమోదం ఇవ్వాలి. వేలి ముద్ర వేయడం ద్వారా భవిష్యతలో అభ్యన్తరం వ్యక్తం చేయడానికి వీలుండదు.సిఆర్‌డిఎ రీజియన్‌లో తాజా భూసమీకరణ రెసిడెన్షియల్ అసోసియేషన్‌కు యూజర్ ఛార్జీల వసూలు బాధ్యత కొత్త నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఆరునెలల్లో...
ఆరునెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. రాజధాని పరిధిలో కొత్తగా సమీకరించే భూముల నుండి తీసుకునే ప్లాట్ల నిర్వహణ కమిషనర్ గుర్తించిన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లేదా స్థానిక సంస్థ యూజర్ ఛార్జీలు వసూలు చేయడం ద్వారా నిర్వహించాలని పేర్కొంది. సమీకరించిన భూములపై సర్వహక్కులూ కమిషనర్‌వే, మరలా తిరిగి తీసుకోబోమని ముందుగానే రైతులు ధృవీకరించాలని పేర్కొంది. ప్రస్తుతం అమరావతి రాజధాని 217 చదరపు కిలోమీటర్లు పరిధిలో కాకుండా అదనంగా భూములు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తీసుకున్నభూములకు ప్రతిగా రైతులకు ప్లాట్లను కేటాయించనున్నారు. భూమిని బట్టి రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లుగా చేసి రైతులకు కేటాయించనున్నారు.
ప్లాట్ల కేటాయింపు ...
పూలింగుకు భూములిచ్చిన రైతులకు సంబంధించి పట్టాదారులకు మెట్ట, జరీబులో నివాస ప్రాంతం వెయ్యి గజాలు ఇవ్వనున్నారు. కమర్షియల్ ప్లాట్లను 250 గజాలు, 450 గజాల చొప్పున కేటాయిస్తారు. అసైన్డ్ భూములకు సంబంధించి మొదటి కేటగిరీ వారికి రెండు ప్రాంతాల్లోనూ 1000 గజాల చొప్పున కేటాయిస్తారు. కమర్షియల్ ప్లాట్లనూ 250, 450 గజాల చొప్పున ఇవ్వనున్నారు. రెండో కేటగిరీ వారికీ ఇదే పద్ధతి అమలు చేయనున్నారు. మూడో కేటగిరీ వారికి 800 గజాలు, వాణిజ్య ప్లాట్లు మెట్టలో 100 గజాలు, జరీబులో 200 గజాలు ఇవ్వనున్నారు. నాలుగు, ఐదు కేటగిరీ వారికి నివాస భూమిని 500 గజాల చొప్పున ఇస్తారు. కమర్షియల్ ప్టాల్లను మెట్టలో 50 గజాలు, జరీబులో 100 గజాలు ఇవ్వనున్నారు. ఆరో కేటగిరీ వారికి 250 గజాల చొప్పున నివాస భూమిని ఇస్తారు. అలాగే వార్షిక కౌలును మెట్టకు రూ.30 వేలు, జరీబుకు రూ.50 వేలు ఇస్తారు. ప్రతి ఏటా మూడువేల, ఐదువేలు చొప్పున పెంచనున్నారు.