Chandrababu : గుడ్ న్యూస్... మూడు పథకాలకు ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు.. ఇక డబ్బులే .. డబ్బులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదినెలలు అవుతుంది. దీంతో త్వరలో మూడు పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది.

Update: 2025-02-06 13:01 GMT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదినెలలు అవుతుంది. దీంతో త్వరలో మూడు పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది. వరసగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధమయింది. ముఖ్యమైన పథకాలను గ్రౌండ్ చేయబోతున్నట్లు మంత్రి వర్గసమావేశంలో ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఖజానా ఖాళీ కావడంతో వెంటనే కొన్నిపథకాలను అమలు చేయలేకపోయామని చంద్రబాబు వివరించారు.ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పింఛను మొత్తాన్ని అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే నాలుగు వేలరూపాయలను అందించడం ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు.

గ్రౌండ్ చేయడానికి...
మరో ముఖ్యమైన మూడు పథకాలను గ్రౌండ్ చేయడానికి రెడీ అవుతున్నామని కూడా చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం నిధులను వచ్చే జూన్ నెల నుంచి ప్రారంభించనున్నారు. విద్యాసంవత్సరం వేసవి సెలవుల అనంతరం ఒక్కొక్కరికీ పదిహేను వేలరూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నప్పటికీ అందరికీ ఈ పథకం అమలుచేస్తామని మాట ఇవ్వడంతో అందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఎంపిక చేయాలని, అనర్హులు ఎవరూ ఇందులో ఉండకుండా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కూడా మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కోరారు. ప్రజాధనం వృధా కాకూడదన్న అభిప్రాయంతోనే అనర్హులను పథకాల నుంచి తొలగించాలని ఆయన తెలిపారు.
అన్నదాతా సుఖీభవ...
ఇక మరో ముఖ్యమైనది రైతులకు అన్నదాత సుఖీభవ కూడా పథకాన్ని కూడా మే నెల నుంచి అమలు చేయనున్నారు. ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయల నగదును జమ చేయాలని భావిస్తున్నారు. పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే ఈ సాయంతో రైతులు విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేస్తారని, అందుకే వారికి అవసరమైన సమయంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విధివిధానాలను కూడా ఖరారుచేయాలని సంబంధిత శాఖ అధికారులను ,మంత్రిని ఆదేశించారు. ఇక మూడో పథకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉగాది నుంచి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఉచిత బస్సు పథకం పకడ్బందీగా అమలుచేయాలని, ఎవరికీ నష్టం కలగకుండా దానిని అమలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఏప్రిల్ నెలలో మత్స్యకార భరోసాను ఇవ్వాలనికూడా చంద్రబాబు నిర్ణయించారు.


Tags:    

Similar News