Narendra Modi : రేపు ప్రధాని ఏపీకి ఇచ్చే వరాలివే

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటనలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు

Update: 2025-10-15 01:52 GMT

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటనలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొత్తం 13,429 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులలో కొన్నింటికి శంకుస్థాపనలు, మరికొన్నింటికి ప్రారంభోత్సవాలు చేస్తారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులతో పాటు విద్యుత్తు, పారిశ్రామిక కేంద్రాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మేరకు అధికారులు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కర్నూలులో 2,886 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులు, ఓర్వకల్లులో 2,786 కోట్ల వ్యయంతో పారిశ్రామిక కేంద్రం, కడప జిల్లా కొప్పర్తిలో 2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం, కొత్తవలస - విజయనగరం మధ్య కొత్త రైల్వే లైన్ కోసం 493 కోట్ల వ్యయంతోనూ, పెందుర్తి, సింహాచలం నార్త్ స్టేషన్ల మధ్య 184 కోట్లతో నిర్మించే రైల్వే వంతెన, 964 కోట్ల వ్యయంతో నిర్మించే సబ్బవరం - షీలానగర్ వరకూ నిర్మించనున్న జాతీయ రహదారికి శంకుస్థాపనలు చేయనున్నారు.

ప్రారంభోత్సవాలు...
దీంతో పాటు కృష్ణా జిల్లా నిమ్మలూరులో 362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టు, చిత్తూరు జిల్లాలో రెండు వందల కోట్లతో చేపట్టిన ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్, పీలేరు - కల్లూరు జాతీయ రహదారి, కడప నుంచి నెల్లూరు వరకూ నిర్మించిన టూ లైన్ జాతీయ రహదారి, గుడివాడ - నూజెళ్ల రైల్వే స్టేషన్ మధ్య గుడివాడలో నిర్మించిన వంతెన, కడప హైవేలో ఉన్న పాపాఘ్ని నదిపై నిర్మించిన వంతెన, కనిగిరి బైపాస్, అనంతపురం - కల్యాణదుర్గం బైపాస్ రోడ్డు పనులకు ప్రారంభం చేయనున్నారు. మొత్తం 546 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన రైల్వే ప్రాజెక్టులను, శ్రీకాకుళం - అంగుల్ మధ్య 1,733 కోట్లతో నిర్మించిన సహజ వాయు పైపులైన్ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నట్లు అధికారుల వెల్లడించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇందుకోసం మంత్రుల కమిటీని చంద్రబాబు నాయుడు నియమించారు.
Tags:    

Similar News