Narendra Modi : నేడు మోదీ సంచలన ప్రకటన చేయనున్నారా?
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బెలూన్లను ఎగురవేయడతో పాటు డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధం విధించారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలుత శ్రీశైలం పర్యటనకు వెళతారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కర్నూలుకు చేరుకుంటారు. శ్రీశైలంలోనూ భారీ బందోబస్తు చేపట్టారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఘాట్ రోడ్ లో వాహనాలను అనుమతించరు. ఇక కర్నూలులోనూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రధాని సెక్యూరిటీ కర్నూలుకు చేరుకుని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నన్నూరులో సభ...
ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణలో భాగంగా ప్రజలను చైతన్యం చేసేందుకు కర్నూలు శివారులో ఉన్న నన్నూరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు మూడు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుంచి కూటమి పార్టీల కార్యకర్తలు ఇప్పటికే బస్సుల్లో కర్నూలుకు చేరుకున్నారు. భారీ బహిరంగ సభను 450 ఎకరాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మొత్తం పదమూడు వేల కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్ గా చేయనున్నారు.
బహిరంగ సభ వద్ద...
బహిరంగ సభకు ఏడు వేల ఆర్టీసీ బస్సులను వినియోగించారు. సభ ప్రాంగణంలో తాత్కాలిక మరుగుదొడ్లు, ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్యం అందించేందుకు వైద్యులను కూడా సిద్ధం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఈరోజు మధ్యాహ్నం, రాత్రి భోజనాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ బహిరంగ సభ ప్రాంగణం వద్ద 7,500 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు కనిపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు, ప్రధాని భద్రతా సిబ్బంది సభా వేదికను తమ అధీనంలోకి తీసుకున్నారు. వేదికపైకి అనుమతి ఉన్నవారిని మాత్రమే అవకాశముంటుంది. ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మోదీ ఏపీకి వరాలు ప్రకటిస్తారన్న ఆశల్లో కూటమి నేతలున్నారు.