YSRCP : నారాయణ స్వామి మౌనం దేనికి సంకేతం?
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నారాయణ స్వామి యాక్టివ్ గా ఉన్నారు. మంత్రిగా ఐదేళ్ల పాటు కొనసాగారు
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నారాయణ స్వామి యాక్టివ్ గా ఉన్నారు. మంత్రిగా ఐదేళ్ల పాటు కొనసాగారు. అయితే ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణస్వామి మద్యం స్కామ్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆయన పత్తా లేకుండా పోయారు. అసలు పార్టీలో ఆయన ఉన్నారా? లేదా? అన్న అనుమానం కలుగుతుంది. నారాయణస్వామి మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో పాటు లోకేశ్ మిగిలిన కీలక నేతలందరిపై విమర్శలు చేస్తూ వచ్చే వారు. జగన్ మంత్రివర్గంలో నారాయణస్వామి ఐదేళ్ల పాటు కొనసాగడానికి వెనక కూడా ఆయన సామాజికవర్గంతో పాటు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడిగా ఉండటమే కారణం.
ఐదేళ్లు మంత్రిగానే...
కళత్తూరు నారాయణ స్వామి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లోకి వచ్చార. 1994, 1999లో సత్యవేడు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2004లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన 2009లో సత్యవేడు నియోజకవర్గం నుండి ఓడిపోయారు.. 2014, 2019 శాసనసభ ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వై.ఎస్. జగన్ మంత్రివర్గంలో 2019 జూన్ 8న ఉప ముఖ్యమంత్రిగా, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారంటే జగన్ ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతుంది.
పోటీ చేయకుండానే...
నాడు చంద్రబాబుపై విరుచుకుపడిన నారాయణస్వామి గత ఏడాది నుంచి పత్తా లేకుండా పోయారు. తాజాగా తిరుపతిలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో కనిపించారు. కానీ పెద్దగా యాక్టివ్ గా లేరు అయితే 2024 ఎన్నికల్లో నారాయణస్వామికి చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరినప్పటికీ అందుకు ఆయన అంగీకరించలేదు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆయన కుమార్తెకు టిక్కెట్ ఇచ్చారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైసీపీ నేతలు నారాయణస్వామికి టిక్కెట్ ఇవ్వవద్దంటూ గట్టిగా పట్టుబట్టడంతో జగన్ ఆయనను పక్కన పెట్టారు. అయినా కుమార్తెకు టిక్కెట్ ఇవ్వడంతో కొంత శాంతించిన నారాయణస్వామి ఆమె గెలుపు కోసం పనిచేసినాఫలితం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని విజయం వరించింది.
లిక్కర్ స్కాం పై విచారణ జరుగుతున్న సమయంలో...
అయితే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ పై విచారణ జరుగుతున్న సందర్భంగా నారాయణస్వామి మౌనంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే నారాయణస్వామి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అమెరికాలో ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లి వచ్చారని, నియోజకవర్గం క్యాడర్ కు కూడా దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతున్న సమయంలో ఐదేళ్ల పాటు ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించిన నారాయణస్వామి మౌనం ఇప్పుడు అధికార పార్టీకి వరంగా మారింది. అయితే ఇక నారాయణ స్వామి రాజకీయాల నుంచితప్పుకునే ఛాన్స ఉందంటున్నారు. రాజకీయ సన్యాసం వైపు స్వామి అడుగులు వేస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తుంది.